మీకు సవాల్ విసురుతున్నా.. నేను ఇంట్లోనే కూర్చుంటా. మీరు కూడా ప్రచారం చేయకండి. అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో అని సవాల్ విసిరారు జానారెడ్డి. తన గెలుపుపై అంత కాన్ఫిడెన్స్ గా ఉన్న ఆయన.. తీరా ఫలితాల్లో మాత్రం డీలా పడ్డారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఇక ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కారు జోరు చూపించింది. నోముల భగత్ కుమార్ కే సాగర్ ప్రజలు పట్టం కట్టారు.
నోముల నర్సింహ్మయ్య మరణంతో సాగర్ లో ఉప ఎన్నికలు వచ్చాయి. టీఆర్ ఎస్ నుంచి ఆయన కుమారుడు నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు. అయితే ముందు నుంచి టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఒకానొక దశలో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సర్వేలు కూడా చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ జానారెడ్డికి మంచి పేరుంది. ఆయన కంచుకోటగా సాగర్ ను చెప్పుకుంటారు. అలాంటి కోటలో కారు బ్రేకు లేకుండా దూసుకుపోయింది.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి భగత్ ఆధిక్యాన్ని కొనసాగించారు. తొమ్మిది రౌండ్ల వరకు జానారెడ్డి కానరాలేదు. ఒక్క రౌండ్ లో కూడా కనీస పోటీ ఇవ్వలేదు. కాగా 10, 11, రౌండ్లలో కాస్త పోటీనిచ్చారు. అయితే 19రౌండ్లలో కేవలం 14రౌండ్లో మాత్రమే ఆధిక్యం చూపించారు. అయితే మళ్లీ వరుసగా ఐదు రౌండ్లలో టీఆర్ ఎస్ ఎదురులేని ఆధిక్యంతో దూసుకుపోయింది. మొత్తం 18,449 ఓట్ల మెజార్టీతో భగత్ గెలిచాడు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 87,254 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 68,805 ఓట్లు పోలయ్యాయి. ఇక దుబ్బాక ఎలక్షన్ తో డీలా పడ్డ టీఆర్ ఎస్.. ఆ తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం నమోదు చేసింది. దీని తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కావడంతో టీఆర్ ఎస్ దీన్ని సవాల్ గా తీసుకుంది.
స్వయంగా కేసీఆర్ దీన్ని టేకప్ చేశారు. బహిరంగ సభ పెట్టి వరాలు కురిపించడం కలిసి వచ్చింది. ఇదే టీఆర్ ఎస్ గెలుపుకు బీజం వేసిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ గెలుపుతో గులాబీ తోటలో సంబురాలు జరుపుకుంటున్నారు.