బెజ‌వాడ‌లో టిడిపి నేత‌ల ఆగ‌డాలు

-

  • పోలీసుల‌పై చేయిచేసుకుంటున్న చోద్యం చూస్తున్న అధికారులు
  • వ‌రుస దాడుల‌తో హ‌డ‌లిపోతున్న సిబ్బంది

విజయవాడ నగరంలో పోలీసులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సివస్తోంది. నగరంలో ఈ నెల 7వ తేదీ రాత్రి పోలీసులు డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసుల తనిఖీల్లో ఎన్‌టీఆర్‌ సర్కిల్‌వద్ద ఒక టీడీపీ నేత తప్పతాగి వాహనం నడుపుతూ పొలీసులకు పట్టుబడ్డాడు. ట్రాఫిక్‌ పోలీసులు అతను ఎంత మోతాదు మద్యం సేవించాడో నిర్ధారించుకోవడానికి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టు చేయటానికి సిద్ధమవుతుండగా వారిపై ఆ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించటంతో స్థానిక పోలీసులు సైతం అక్కడకు చేరుకుని టీడీపీ నేతతో పాటు అతని అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత అనుచరులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని అక్కడ నానా హంగామా సృష్టించారు. పోలీసులపై దుర్భాషలాడారు. మమ్మల్నే స్టేషన్‌కు తీసుకు వస్తారా? అంటూ వీరంగం సృష్టించారు. చివరకు మంత్రి రంగంలోకి దిగడంతో పోలీసు ఉన్నతాధికారులు కేసును నీరుగార్చారు.

ఫొటో తీసి.. ఏమీ పికుతావ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌పై దుర్భాషలాడిన ఓ టీడీపీ నేత
నీవెంత.. నీవు ఏం చేస్తావ్‌.. నీఇష్టం వచ్చిన వారికి చెప్పుకో’ అంటూ ఓ టీడీపీ నేత ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన ఘటన ఈ నెల 20వ తేదీ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ముందు చోటుచేసుకుంది. సాయంత్రం 5.55 గంటల సమయంలో బందరు రోడ్డు నుంచి పాత బస్టాండ్‌ రోడ్డు వైపునకు వెళ్లేందుకు కారు మలుపు తిరుగుతోంది. అయితే వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కుమార్‌ వాహనాన్ని నిలిపివేయడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో వాహనం నడుపుతున్న వ్యక్తి నడిరోడ్డుపై వాహనాన్ని ఆపి కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లి కొట్టేంత పనిచేశాడు. ‘నువ్వేం చేస్తావ్‌.. ఫొటోలు తీసి ఏమి పికుతావ్‌’ అంటూ హేళనగా మాట్లాడాడు.

సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి..
గణేష్‌ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఈ నెల 22న పటమటలోని బందరు రోడ్డులో అధికార పార్టీకి చెందిన కొందరు సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచారు. రాత్రి 11 గంటల సమయంలో నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న గణేష్‌ విగ్రహాన్ని ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. అయితే గుర్రపు బగ్గీలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఊరేగింపులో హడావుడి చేస్తున్న టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల మాటలు పెడచెవిన పెట్టడమే కాకుండా ఏకంగా విధుల్లో ఉన్న సీఐ బ్యాడ్జీని చించివేశారు. ఎస్‌ఐను పట్టుకుని గాల్లోకి లేపారు. ముగ్గురు కానిస్టేబుళ్లను తోసేసి, ఒక కానిస్టేబుల్‌పై దాడికి దిగి చొక్కాను చించేశారు. కేవలం కొందరు అల్లరిమూకలపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధి ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో కేసును మమ అనిపించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version