- ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఎప్పుడైనా అమలు చేసిందా
- ప్రశ్నించిన ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
- బీఆర్ఎస్ తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య
AIMIM…. ఈ పార్టీ జాతీయ స్థాయికి ఎదగడానికి కారణం కాంగ్రెస్ తో దోస్తీ అనే చెప్పుకోవాలి. కేవలం హైద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ పార్టీ గతంలో కాంగ్రెస్ కి మద్దతుగా నిలబడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కేవలం పాత బస్తీకే పరిమితమై దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. మైనార్టీలకు అధిక ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీ…ప్రత్యేకించి ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అలా రాజకీయ ఎదుగుదలకు హస్తం పార్టీ అధిక ప్రాముఖ్యతను కల్పించింది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఎవరు ఎవరితో జోడీ కడతారో ఎవరితో విడిపోతారో వంటి అంశాలు ఎప్పుడూ ఆశక్తికరమే. ఒకప్పుడు కాంగ్రెస్ తో అంటకాగిన ఈ MIM ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది.
శుక్రవారం ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భగంగా ఇదివరకే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని నమ్మవద్దని చెప్పిన అసదుద్దీన్…ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌పైనే విల్లు ఎక్కుపెట్టారు.ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, కాలం చెల్లిన ఆ పాత పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సీజన్ కావడంతో ఇష్టారాజ్యంగా వాగ్దానాలు చేస్తున్నారని విమర్శిస్తూ….
కర్ణాటకలో ఐదు హామీల తరహాలో తెలంగాణలో ఆరు ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలోకి వస్తే వాటిని రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలయ్యాయా అని ఓటర్లను ప్రశ్నించారు.
కర్ణాటకలో పేద పిల్లలకు స్కాలర్‌షిప్ తగ్గించడం,రైతులకు కరెంటు ఇవ్వకపోవడం వంటివి గుర్తుచేసి ఓటర్లలో కాంగ్రెస్ పై వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేయడానికే ఆ పార్టీ వాగ్దానాలు ఇస్తోందని చెప్పారు.అలాగే కాంగ్రెస్ నేత చిదంబరంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని ఆరోపిస్తూ ఇప్పటికీ ఆస్తుల పంపకాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ తప్పిదాలేనని దుయ్యబట్టారు.తమ పార్టీ ప్రచారం బాగా సాగుతోందని చెప్పిన అసదుద్దీన్… ఈసారి కూడా బీఆర్ఎస్ కి మద్దతుగా ఉన్నామని స్పష్టం చేశారు.సిట్టింగ్ 7 మంది ఎమ్మెల్యేలతో పాటు ఈసారి రాజేంద్ర నగర్ మరియు జూబ్లీహిల్స్ సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తపరిచారు. గత 9న్నరేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేశామని ఒవైసీ ఉద్ఘాటించారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీలో లేని నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‌కు ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించిందని అన్నారు.
అటు బీజేపీ పై కూడా ఆయన విమర్శలు చేసారు. తెలంగాణలో బీజేపీ బుల్‌డోజర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బుల్‌డోజర్ అనేది విధ్వంశానికి ప్రతీక అని చెప్తూ అలాంటి పార్టీలకు తాము దూరంగా ఉంటామని చెప్పారు. అభివృద్ధి,సంక్షేమంవంటి అంశాలను ప్రాధాన్యమిస్తున్న పార్టీలకు మాత్రమె అండగా నిలవాలని ఆయన ఓటర్లను కోరారు.