తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో బిజెపి వెనక్కు తగ్గిందా…? తెలంగాణాలో బలపడాలి అనే కోరికను బిజెపి వాయిదా వేసుకుందా…? కెసిఆర్ తో స్నేహమే మంచిది అనే భావనలో కమలనాథులు ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తెలంగాణాలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ, వేగంగా బలపడాలని భావించింది. తెలంగాణాలో జరుగుతున్న ప్రతీ చిన్న విషయాన్ని వాడుకునే ప్రయత్నం బిజెపి చేసింది. ఆర్టీసి ఉద్యమం నుంచి ప్రతీ వ్యవహారాన్ని అల్లరి చెయ్యాలని భావించింది.
అయితే కెసిఆర్ ప్రతీ విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి బిజెపికి అడ్డుకట్ట వేసారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాల ఫలితాలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానాలలో ఒక్క దాంట్లో కూడా బిజెపి సొంతగా అధికారంలోకి రాలేకపోయింది అనేది వాస్తవం. హర్యానాల బలవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా ఉన్న మిత్రపక్షం శివసేన బిజెపి కి గుడ్ బాయ్ చెప్పి ఎన్డియే నుంచి వేగంగా బయటకు వచ్చేసింది.
ఝార్ఖండ్ ఎన్నికల్లో కూడా బిజెపి ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు సొంత బలం వద్దు స్నేహాలను బలోపేతం చేసుకుందామని బిజెపి భావిస్తుంది. అందుకే కెసిఆర్ తో స్నేహం చేయడానికి ప్రయత్నాలు చేయమని బిజెపి నేతలకు సూచించింది. ఆయన మీద విమర్శలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పారట. తెలంగాణాలో తెరాస బలంగా ఉంది కాబట్టి ఎన్డియేలోకి తీసుకురాకపోయినా సరే జాగ్రత్తగా ఉందామని, ఆయనతో స్నేహం అవసరమని చెప్పారట అమిత్ షా.