అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును పోలీసులు చేధించారు. లిసిటిపుట్టు వద్ద ఆదివారం కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలో పాల్గొన్న మావోయిస్టులను ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నలుగురిని పోలీసులు గుర్తించారు. జునుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో, మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్ స్వరూప, సింద్రి చంద్రి, మరో మహిళా మావోయిస్టు వెంకట రవిచైతన్య అలియాస్ అరుణగా గుర్తించారు. వీరి కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు.
అయితే హత్యలో ఆర్కే సారధ్యంలో ఈ హత్య జరిగిందని మొదటగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న తరుణంలోనే చలపతి తెరపైకి వచ్చాడు. రామకృష్ణ కాదు అసలు సూత్రదారి చలపతే అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు చలపతి భార్య అరుణ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగిందని, ఆ హత్యలో ఆమెనే పాల్గొందని పోలీసులు ప్రచారం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… సుమారు 60 మంది మావోయిస్టులు దాడిలో పాల్గొన్నారని సమాచారం. వీరిలో సగం మంది మహిళలే కావడం గమనార్హం. వీరంతా శనివారం రాత్రే లివిటిపుట్టు సమీపానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకల్లా గ్రామంలోకి వెళ్లారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఏవోబీలో మావోల వైపు నుంచి ఎలాంటి ఘటన జరిగినా చలపతే తెరపైకి వస్తుంటాడు. గెరిల్లా దాడి వ్యూహ రచనలో చలపతికి మంచి పేరుంది. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం కేసులోనూ చలపతి నిందితుడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. చలపతి అసలు పేరు ప్రతాప్ రెడ్డి. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని ముత్యంపైపల్లె. ఆయన ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాడు. మొదట ఈయనకు పట్టుపరిశ్రమల శాఖలో ఉద్యోగం వచ్చింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం క్లస్టరులో సుమారు రెండున్నర సంవత్సరాలు పనిచేశాక మదనపల్లెకు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసే సమయంలోనే నక్సలైట్లతో సంబంధాలు ఏర్పడ్డాయి.