జల జగడం: కేసీఆర్ 1, జగన్ 1+5 ఫార్ములా…?

-

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ముందు నుంచి సైలెంట్‌గా ఉంటూ, ఇప్పుడు కేసీఆర్-జగన్‌లు జల జగడం పెట్టుకోవడంపై రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్-జగన్‌లు జల జగడం రాజేశారని అంటున్నారు. ఈ జల వివాదం ద్వారా ప్రతిపక్షాలని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అంటున్నారు.

అదే సమయంలో ఉపఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్-జగన్‌లు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక నడుస్తున్న విషయం తెలిసిందే. బలమైన ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళి పోటీ చేయడంతో టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి, ప్రజల్లో సెంటిమెంట్ రాజేసి, దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని బీజేపీ విమర్శిస్తుంది. కాంగ్రెస్ సైతం ఇదే తరహా విమర్శలు చేస్తుంది.

ఇక ఏపీలో కూడా జగన్ అదే ఫార్ములాతో ముందుకెళుతున్నారని, ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే బద్వేలు ఎమ్మెల్యే చనిపోవడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అలాగే టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించి ఉపఎన్నికలు నిర్వహించాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. అలాగే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేస్తే, నరసాపురం పార్లమెంట్‌కు కూడా ఉపఎన్నిక వస్తుందని చెబుతున్నారు.

అంటే 1+5 ఫార్ములాతో జగన్ ముందుకెళుతున్నారని, అందుకే కేసీఆర్‌తో జల వివాదాన్ని పెద్దగా చేసి, ఏపీ ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి, అది ఓట్ల రూపంలో లబ్ది పొందాలని చూస్తున్నారని టీడీపీ ఫైర్ అవుతుంది. ఇలా రాజకీయంగా లబ్ది పొందేందుకే కేసీఆర్-జగన్‌లు జల జగడం పెట్టుకున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version