అభ్యర్ధుల ఎంపికలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గీత దాటిన వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నారు.హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని మరోసారి చెప్పారు సీఎం.ఇదే క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అందులో నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యే ఉండటం గమనార్హం.ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.అలాగే ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి. రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
2023లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు.విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఇటీవలే వైఎస్ఆర్‌సీని వీడి జనసేనలో చేరారు. మరో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తెలుగు దేశం పార్టీ ఖండువా కప్పుకున్నారు.వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా వారు ప్రకటించారు. దీంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటేయాలని ఫిర్యాదు చేసింది.
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆచితూచి అడుగులేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మాట వినకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు.ఈ విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాను వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది.ముప్పైకి పైగా స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే మారారు.మరో జాబితాపై కూడ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మొదటి నుంచి జగన్‌తో నడిచిన వారైనా సరే గీత దాటితే ట్రీట్‌మెంట్ మరోలా ఉంటుందని తెలియజేస్తున్నారు సీఎం.