నెల్లూరులో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. ఆ వివరం ఆ వ్యథా భరిత గాథ ఆయన మాటల్లోనే..
“తిరుపతి రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశాం. విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యాం. అటుపై పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం కోసం రూ.15 వేలు డిమాండ్ చేసిన సిబ్బంది ప్రవర్తన చూసి మళ్లీ దిగ్భ్రాంతికి లోనయ్యాం.. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు.
తాజాగా నెల్లూరు జిల్లా సంఘంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణం. ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి.
పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలు అన్నీ ఎక్కడికి పోయాయి YS Jagan Mohan Reddy గారూ? సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ నిర్వహణ మీ వాళ్లకు కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? ” అని ప్రశ్నించారాయన.