పెళ్లికి ఉచితంగా బట్టలు అందిస్తున్న యువతి..!

-

పెళ్లంటే..చేసుకునే పెళ్లికొడుకే కాదు.. వేసకునే బట్టలు కూడా అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. పెళ్లిబట్టల షాపింగ్ అంటే.. పైసులుండాలే కానీ.. ఇరగదీస్తారు. కానీ పెళ్లిచేయడానికే అప్పులు చేసే కుటుంబం..ఇక అంత ఖరీదు పెట్టి బట్టలు ఏం కొంటారు. ఉన్నదాంట్లోనే ఏదో కానిచ్చేస్తారు. ఆర్థికపరిస్థితులు..మన కోరికలకు అడ్డుకాకూడదని… ఓ యువతి పెళ్లికి ఉచితంగా బట్టలు అందిస్తోంది. ఉచితంగా బట్టలు ఇస్తుందంటే..ఈమె ఏదో డబ్బులు దండిగా ఉన్న కుటుంబం అనుకుంటారేమో.. కానే కాదు.. తల్లిదండ్రులు కూలీలు.. రెక్క ఆడితే కానీ.. డొక్క ఆడని పరిస్థితి.

షెహరాబానూది కర్ణాటక రాష్ట్రం మడికేరి తాలూకాలోని ఛెత్తల్లి అనే కుగ్రామం. తల్లిదండ్రులు అమీనా, మాను దినసరి కూలీలు. ఆ కూలీతోనే ఇల్లు గడిచేది. ఆ పరిస్థితుల్లోనూ ఇతరులకు చేయూతనందించడంలో షెహరా బాను ముందుంటుంది. పీయూసీ తర్వాత బ్యుటీషియన్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక్కోసారి తన స్నేహితులకు పెళ్లి కుదిరినప్పుడు అనుకున్నట్లుగా దుస్తులను ఎంపిక చేసుకోలేక, ఉన్నంతలోనే కొనుగోలు చేయడం తను స్యయంగా చూసింది. అప్పుడు వారి కళ్లల్లో అసంతృప్తి ఉండేది.. జీవితంలో పెళ్లంటే ఒకేసారి వస్తుంది.. అందరికి అది మధుర జ్ఞాపకమే.. ఆ సందర్భాన్ని తృప్తిగా మలుచుకోలేకపోతున్న పేదరికాన్ని చూసి బాధపడేది. కేరళలో ఇటువంటి పేద వధువుల కోసం పెళ్లి దుస్తులను ఉచితంగా అందిస్తున్న బొటిక్‌ గురించి తెలిసింది. తానూ అలా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది.

ఈ ఆలోచన వచ్చిన వెంటనే తన వాట్సప్‌ గ్రూపుల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో దీని గురించి వివరిస్తూ పోస్టులు పెట్టింది. ‘చాలామంది సానుకూలంగా స్పందించి, చేయూతనందించడానికి ముందుకొచ్చారు. కొందరు మహిళలైతే వాళ్ల దగ్గర ఉన్న మంచి చీరలను విరాళంగా ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. మరికొందరు తమ వివాహానికి ధరించిన దుస్తులనే ఇచ్చారట.. అలా ఫ్యాన్సీ దుస్తులు కూడా వచ్చాయి. వీరంతా దాదాపు మధ్యతరగతికి చెందిన వారే కావడం విశేషం.

ఈ దుస్తులన్నింటినీ డ్రై క్లీనింగ్‌ చేయించి.. ఆ తర్వాత ఓ చిన్న దుకాణాన్ని తెరిచింది… ఇది దుస్తులను విక్రయించేది కాదు.. కేవలం ఉచితంగా అందించడానికి మాత్రమే. నిరుపేద లేదా అనాథ వధువులు ఇక్కడకొచ్చి నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. కొందరు ఇప్పుడు ధనిక కుటుంబాల మహిళలు కూడా పేద వధువులకు చేయూతనందించడానికి ముందు కొస్తున్నారు.

సోషల్‌ మీడియా, వాట్సప్‌ గ్రూపుల ద్వారా కొందరు వధువులు తనని సంప్రదిస్తారట.. వారు బొటిక్‌కు వచ్చేటప్పుడు వారి మత పెద్దల నుంచి ఒక లేఖను, వారి ఆర్థిక పరిస్థితిని వివరించే పత్రాలను తీసుకొస్తే చాలు. వారికి కావాల్సిన దుస్తులను అందిస్తా అంటుంది ఈ యుువతి.. నెలలోపే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నూతన వధువులు మా బొటిక్‌ నుంచి దుస్తులను ఉచితంగా పొందారు. నచ్చిన దుస్తులను వారి సైజుకు తగినట్లుగా మార్చి అందిస్తున్నా. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం ఇచ్చే తృప్తి కొన్ని కోట్లు ఇచ్చినా రాదు అని గర్వంగా చెబుతుంది షెహరాభాను.

మనకు అవసరం లేనివే.. కానీ మరొకరికి ఎంతో ఉపయోగపడతాయి.. మన ఇళ్లలో కూడా చిన్నప్పటి బట్టలు, మనకు ఇప్పుడు పట్టనివి చాలా ఉంటాయి. వాటిని అలా ఇంట్లోనే ఉంచుకోకుండా..పేదలకు ఇస్తే వాళ్లు ఆనందంగా వాడుకుంటారు కదా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version