కేబినెట్ క‌థ క్లోజ్‌… టీఆర్ఎస్‌లో మ‌రో ట్విస్ట్ ఉండ‌బోతోందా…!

-

తెలంగాణ‌లో నిస్తేజంగా సాగుతున్న రాజకీయాల‌కు కేసీఆర్ ఒకేసారి ఊపుతెచ్చారు. సెప్టెంబ‌ర్ మాసాన్ని తెలంగాణ రాష్ట్ర స‌మితిలో జోష్ ను నింపుతున్నాడు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం, ప్ర‌భుత్వాన్ని స‌మర్థ‌వంతంగా న‌డుప‌డం కోసం ప‌దవుల పందేరంకు శ్రీ‌కారం చుట్టాడు సీఎం కేసీఆర్‌. ఓ వైపు బీజేపీ దూకుడుతో దూసుకుపోతుంటే పార్టీలోని సీనియ‌ర్లు ఎక్క‌డ జారి పోతారో అనే భ‌యం కేసీఆర్‌కు ప‌ట్టుకున్న‌ట్లు ఇప్పుడు ఈ ప‌ద‌వుల పందేరం చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. కేసీఆర్ అన్ని రాజ‌కీయ వ్యూహాల‌తోనే ముందుకు సాగుతుంటారు. తెలంగాణ ఉద్య‌మంలో కూడా మోఖా చూసి వాత పెట్ట‌డం వంటిప‌నులు చేసిన కేసీఆర్ అదును చూసి ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్ట‌డంలో దిట్ట‌గా పేరుంది.

అందుకే ఇప్పుడు బీజేపీ తెలంగాణ‌లో బ‌లోపేతం అయ్యేందుకు స‌న్న‌హాలు చేస్తుంది. అందుకు త‌గిన విధంగా బీజేపీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌తో ముందుకు పోతుండ‌టంతో పార్టీలో అస‌మ్మ‌తి వ‌స్తే త‌న సీటుకు ఎస‌రు వ‌స్తుంద‌ని గ్ర‌హించిన కేసీఆర్ అంద‌రిని శాంత‌ప‌రిచే చ‌ర్య‌ల‌కు పూనుకున్నాడు. ఇంత‌కాలం తెలంగాణ మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం లేని విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే తెలంగాణ కు గ‌వ‌ర్న‌ర్‌గా ఓ మ‌హిళ‌ను బీజేపీ నియ‌మించ‌డంతో మ‌హిళా నేత‌ల‌ను ఎక్క‌డ ఆక‌ర్షించి టీఆర్ఎస్‌లోని మ‌హిళా నేత‌ల‌కు బీజేపీ గాలం వేస్తుందో అనే అనుమానంతో వెంట‌నే మంత్రివ‌ర్గంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించారు.

ఇంత‌కాలం మేన‌ల్లుడు హ‌రీష్‌రావును ప‌క్క‌న‌పెట్టి, కొడుకు కు పెద్ద‌పీట వేసిన కేసీఆర్, హ‌రీష్‌రావుపై బీజేపీ ఫోక‌స్ పెట్ట‌డంతో వెంట‌నే తేరుకుని మంత్రిగా అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. అయితే ఇక్క‌డ అల్లుడికి మంత్రిగా అవ‌కాశం ఇస్తే కొడుకు అలుగుతాడ‌ని గ్ర‌హించిన కేసీఆర్ అల్లుడితో పాటుగా కొడుకుకు కూడా మంత్రి ప‌ద‌వులు ఇచ్చేసి ఎవ్వ‌రికి ఛాన్స్ లేకుండా చేసేశాడు. సీనియ‌ర్ నేత‌, మంత్రి ఈటెల  రాజేంద‌ర్‌ను క‌ద‌లిస్తార‌న్న సందేహాలు వ‌చ్చినా అవేం చేయ‌లేదు.

ఇక అసెంబ్లీలో, మండ‌లిలో ఛీప్ విప్‌, విప్‌లను ఇంత‌కాలం నియ‌మించ‌ని కేసీఆర్ స‌డ‌న్‌గా విప్‌లుగా నియ‌మించాడు. ఇక పార్టీలో సీనియ‌ర్లు అయిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని మండ‌లి చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక పార్టీ క్రియాశీల‌కంగా ఉండే మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి రాజ్య‌స‌భ స‌భ్యునిగా, జూప‌ల్లి కృష్ణారావు రైతు స‌మ‌న్య‌య స‌మితి రాష్ట్ర చైర్మ‌న్‌గా, వీరితో పాటు నాయిని న‌ర్సింహారెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో పాటుగా అనేక మందికి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టి ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నంలో కేసీఆర్ త‌ల‌మున‌క‌లైనాడ‌ట‌.

బీజేపీ గూటికి సీనియ‌ర్లంతా వెళితే టీఆర్ఎస్‌కు గ‌డ్డు రోజులు దాపురిస్తాయ‌నే ఆలోచ‌న కేసీఆర్ చేస్తున్నాడ‌ట‌. అందుకే వ‌రుస‌గా సీనియ‌ర్ల‌ను ప్ర‌సన్నం చేసుకుంటే టీఆర్ఎస్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దనే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అంటే ఇప్ప‌డు బీజేపీ దూకుడు నేప‌థ్యంలో ఆ పార్టీకి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వ‌కూడ‌కుండానే కేసీఆర్ ఈ ప‌ద‌వుల పందేరానికి తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news