నేర‌స్తులు రాజ‌కీయ ముసుగులో ఉంటే న‌ష్టం: చంద్ర‌బాబు

-

*రాష్ట్రంలో ఆందోళ‌న‌లను అంచ‌నా వేయ‌లేద‌ని డిజిపి, ఇంట‌లిజెన్స్ అధికారుల‌కు చివాట్లు
*గ‌వ‌ర్న‌ర్ డిజిపిని నివేదిక అడ‌గ‌టం ఏంటి?

నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత లాంటి వారు జగన్‌పై చిన్న దాడి జరిగిన వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి కూడా సరిగా లేదని.. జగన్‌పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్‌ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఐటీ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారని.. అభివృద్ధిని అడ్డుకునే పనులు సమాజానికి మంచివి కావన్నారు.

ఏపీ పట్ల కేంద్రం వైఖరి కారణంగా కొత్త సమస్యలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌పై దాడి ఘటనలో వైకాపా నాయకులు తనని ఏ1 నిందితుడిగా, డీజీపీని ఏ2గా పేర్కొనడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సైబర్‌ నేర సమీక్షలో భాగంగా వివిధ విభాగాల పోలీసు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని మీడియా ఛానళ్లు పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయని.. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. మీడియాను సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. నేర నియంత్రణపై జిల్లా ఎస్పీలు గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ఈ విష‌యంలో నిఘా వైఫ‌ల్యంపై వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఫైర్ అయ్యారు.

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అదుపు చేయడంతో పాటు సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. మహిళలపై సమాజంలో పెరుగుతున్న అత్యాచారాల ఘటనలను సాంకేతికత సాయంతో పోలీసులు పూర్తిగా అదుపు చేయాలని కోరారు. మహిళలపై నేర నియంత్రణకు గానూ ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య నుంచి ఒక సమన్వయకర్తను నియమించుకోవాలని ఆదేశించారు. చట్టాలపై మహిళల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ‘చేరువ’ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఫ్లాష్‌ నేరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news