ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ స్వరూపమే మారిపోయింది. ఏపీయే కాదు.. తెలంగాణతో ఏపీకు ముడిపడి ఉన్న ఆంశాలపై కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో ఎన్నో అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సహకరించలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
అయితే.. ఎప్పుడైతే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారో.. రాష్ట్ర విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టారు. వాటి పరిష్కారానికి సీఎం కేసీఆర్ తో సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం స్నేహపూరిత వాతావరణమే ఉంది.
ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీ ఆధ్వర్యంలో ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలను తెలంగాణకు అప్పగించారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిపై చర్చించడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ఇవాళ భేటీ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై వాళ్లు చర్చిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను రెండు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి… గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో వెళ్లకుండా.. ఎలా దారి మళ్లించాలి.. దాని ద్వారా పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా కరువును పారద్రోలాలి.. అనే అంశాలపై ప్రధానంగా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బీ రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య, సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, సీనియర్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, ధనుంజయ్ రెడ్డి, నీటి పారుదల శాఖ నిపుణులు, అధికారులు, రిటైర్డ్ ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ తో పాటు.. మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం ఇవాళ సాయంత్రం వరకు జరగనుంది. వీలైతే రేపు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్చిస్తున్నారు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద ఉన్న అప్పులు, ఆస్తులు, ఉద్యోగుల విభజనపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఆర్టీసీ విలీనం, విద్యుత్ సంస్థలపై కూడా చర్చిస్తున్నారు. దానితో పాటు.. ఏపీకి చెందిన 1157 మంది విద్యుత్ ఉద్యోగులు తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వారి బదిలీపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
మరోవైపు.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం… గోదావరిలో ఏపీ, తెలంగాణకు 1480 టీఎంసీలు ఇస్తుండగా… కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలకు 811 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే.. కృష్ణా, గోదావరికి చెందిన మరో 3500 టీఎంసీలు ఏపీలోనే వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని సముద్రంలో కలవకుండా.. కాపాడుకోగలిగితే… మళ్లించగలిగితే.. తెలంగాణ, ఏపీలో కరువు అనేదే లేకుండా చేయొచ్చు. సో.. దీనిపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.