కృష్ణా బోర్డు కు ఏపీ సర్కార్ మరో లేఖ

అమరావతి : కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా నదిపై జలాశయాలన్నీ పొంగి పొర్లుతున్నాయని.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలివేయాల్సి వస్తోందని… వరద నియంత్రణలో భాగంగా ఈ నీటిని ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి మళ్లించకపోతే పులిచింతల, ప్రకాశం బ్యారేజి ఫోర్‌ షోర్‌ లో, దిగువన పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ఎగువనే వివిధ మార్గాల ద్వారా నీటిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని వెల్లడించారు. ఇది కేవలం వరద జలాల మళ్లింపు మాత్రమేనని.. ఈ మళ్లింపును ఏ రకంగాను ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వాటాలో భాగంగా పరిగణనలోకి తీసుకోకూడదని వెల్లడించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి అనుమతి అడిగిన ఆంధ్రప్రదేశ్‌ వరద నీటిని మళ్లించకపోతే దిగువన ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

రాష్ట్ర విభజన చట్టం 85 (7) ఈ పేరా 6 ప్రకారం ప్రకృతి విపత్తులను నిర్వహణలో ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలని, ఇందుకు బోర్డులు సలహాలు, సూచనలు అందిస్తాయని పేర్కొంటోందని.. ఈ విషయంలో బోర్డులకు తమ ఆదేశాలు అమలు చేసేలా విస్తృత అధికారాలు ఉన్నాయని వివరించారు. వరదల సమయంలో నీటి విడుదల, డ్యాంలు, జలవిద్యుత్తు కేంద్రాల నిర్వహణ విషయంలో బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా నదిలో మిగులు జలాలను కుడిగట్టు విద్యుత్కేంద్రం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలని మరోసారి కోరుతున్నామని ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు.