త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఆసిఫాబాద్, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

-

ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆసిఫాబాద్, పినపాక ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి పని చేయాలని.. దాని కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యేలు తెలిపారు.

సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తాము బలపరుస్తామన్నారు. అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేసి అయినా మళ్లీ పోటీ చేస్తామని ప్రకటించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరికపై సంయుక్త లేఖను మీడియాకు విడుదల చేశారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు, గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్లు లేఖలో పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ తో సమావేశమయి.. టీఆర్ఎస్ లో చేరడానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించుకుంటామని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని… కేంద్రంలో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం రానున్నదని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ పోడు, గిరిజన భూములకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చినట్లు వాళ్లు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరితే ఇక మిగిలేది 17 మంది. ఇక.. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version