వైకాపా తరఫున పోటీ చేస్తే సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదురవుతాయని, జనసేన తరఫున పోటీ చేస్తే గెలుస్తామో, లేదోనని చెప్పి.. అలీ టీడీపీ తరఫునే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.
ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ త్వరలో రాజకీయాల్లో రానున్నారా..? ఎమ్మెల్యేగా ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అలీ త్వరలో ఏపీలో టీడీపీ తరఫున గుంటూర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. అయితే అలీ మాత్రం తనకు టీడీపీలో టిక్కెట్ వస్తుందో, రాదోనన్న భావనతో అటు టీడీపీ మాత్రమే కాకుండా, ఇటు వైసీపీ, జనసేనలతో కూడా టచ్ లో ఉన్నారని, మూడింటిలో ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా సమాచారం అందుతోంది.
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ కావాలని అలీ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తోపాటు అటు జనసేన అధినేత, స్నేహితుడు అయిన పవన్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబును కోరాడట. ఈ క్రమంలో టీడీపీ నుంచి తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఖాయం అవుతుందని అలీ భావిస్తున్నారు. కాగా అలీ ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. సినీ పరిశ్రమలో కమ్మ సామాజిక వర్గ ప్రముఖులతో అలీకి చాలా పరిచయాలు ఉన్నాయి. దీంతో టీడీపీలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఖాయమని అలీ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక అలీకి హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండగా, ఇటీవలే గుంటూరు ఈస్ట్‌లో తనకు ఓటు హక్కు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కూడా ఓటు ఉంది కదా, దాన్ని ఏం చేయమంటారు అని అధికారులు అడిగితే తనకు గుంటూరు ఈస్ట్‌లోనే ఓటు కావాలని, అవసరం అయితే హైదరాబాద్ లో ఉన్న ఓటు తీసేయాలని అలీ ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే అలీ ఈసారి ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఏదో ఒక పార్టీ తరఫున కచ్చితంగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే వైకాపా తరఫున పోటీ చేస్తే సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదురవుతాయని, జనసేన తరఫున పోటీ చేస్తే గెలుస్తామో, లేదోనని చెప్పి.. అలీ టీడీపీ తరఫునే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లాలో అలీకి బంధుగణం కూడా ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ తరఫున గుంటూర్ ఈస్ట్ టిక్కెట్టు కోసం అలీ గట్టిగానే యత్నిస్తున్నారట. కానీ మరోవైపు గత ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మద్దాలి గిరితోపాటు మరికొందరు కూడా టీడీపీ టిక్కెట్ కోసం యత్నిస్తున్నారట. కానీ చంద్రబాబు మాత్రం అలీకే టిక్కెట్టు ఇవ్వవచ్చని తెలిసింది. అయితే.. మరి అలీ చివరకు ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!