ఏపీలో సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ ప్రతిపాదన మంచిదే అని సమర్థిస్తుంటే… మరికొందరు మాత్రం దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా అమరావతికీ ఏ ఇబ్బంది ఉందదని, అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మూడు రాజధానులు వలన రాష్ట్రం అంతా ఒకే సారి అభివృద్ధి చెందుతుందని మంత్రి అవంతి పేర్కొన్నారు.
కాగా, మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై విపక్షాలు, రాజధాని రైతులు భగ్గుమంటున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు సీఎం జగన్‌తో జీఎన్ రావు కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 03.30కి సీఎంతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ, శుక్రవారమే సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.