సినీ నటుడు బాబు మోహన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి. రాజకీయాల్లోనూ ఓ వెలుగు వెలిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సైతం పనిచేశారు. ఇది ఒకప్పటి మాట. రోజుకో పార్టీ మారుతూ వస్తున్న బాబు మోహన్.. చివరికి ఎంపీ టికెట్ కోసం ప్రజా శాంతి పార్టీలో చేరడం రాజకీయ వర్గాలను విస్మయం కలిగిస్తోంది.
హాస్య నటుడిగా మంచి పేరు సంపాదించిన బాబు మోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చారు. 1999లో ఆందోల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కార్మిక మంత్రిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత 2004లోనూ తిరిగి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఓటమిపాలైన బాబు మోహన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్లో చేరారు. 2014లో తిరిగి ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించడంలో 2019లో ఆందోల్ టికెట్ దక్కలేదు. ఆ కారణంతో బాబు మోహన్ బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నుంచి పోటీ చేసిన ఆయన కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అదీ కాకుండా మొదట పోటీ చేయనని, ఆ తర్వాత బరిలో నిలిచారు.
అయితే, వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం తన కలగా బాబు మోహన్ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి అవకాశం కల్పించినా అడిగినా అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో ఇటీవల బీజేపీకి సైతం గుడ్‌బై చెప్పారు.
ఇప్పటికే టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలను చుట్టి వచ్చిన బాబు మోహన్.. ఎలాగైనా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చే ప్రసక్తి లేకపోవడంతో చివరికి కేఏ పాల్ నేతృత్వంతలోని ప్రజా శాంతి పార్టీలో చేరిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ సైతం ప్రకటించారు.