తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సీట్లలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతూ వస్తున్న విషయం తెలిసిందే…ఆ తర్వాత నుంచి కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ హవా నడుస్తూ వస్తుంది. అలా అని పూర్తిగా ఎస్సీ, ఎస్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాల్లో సత్తా చాటింది. అయితే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ సైతం…ఎస్సీ, ఎస్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే…ఆ స్థానాల్లో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుంది..ఆ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు..అందుకే ఆయా స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గతంలో చొప్పదండి టీడీపీకి కంచుకోట…1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలం తగ్గిపోయింది.
ఈ క్రమంలోనే 2014లో టీఆర్ఎస్ నుంచి బోడిగే శోభ గెలిచారు…అయితే 2018 ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వలేదు. టీఆర్ఎస్ నుంచి సుంకే రవిశంకర్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి మేడిపల్లి సత్యంపై భారీ మెజారిటీ గెలిచారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చొప్పదండిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ పార్లమెంట్లో హుస్నాబాద్, సిరిసిల్ల మినహా, మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది.
అయితే అప్పటినుంచి చొప్పదండిపై బండి ఫోకస్ పెట్టారు. అలాగే ఈటల రాజేందర్ తో పాటు శోభ బీజేపీలో చేరాక…చొప్పదండిలో బీజేపీ బలం మరింత పెరిగింది…అక్కడ టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనేల శోభ పనిచేస్తున్నారు. ఇక ఇక్కడ పలు మండలాల్లో కాంగ్రెస్ కొంత బలంగా ఉన్నా.. నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీల మధ్యే ఉంటుంది. బీజేపీ ఇంకాస్త కష్టపడితే చొప్పందండిని కైవసం చేసుకోవచ్చు.