తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్‌కు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను కాదని బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగుతోంది. ఇప్పటికే పార్టీలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ అసంతృప్తులు ఎంతోమంది చేరారు. ఇక నిన్న ఈటల రాజేందర్ కూడా చేరడంతో ఆ పార్టీ మరింత బలం పెంచుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ బలపడితే ఎక్కడైనా అధికార పార్టీ నాయకులు టెన్షన్ పడతారు.
కానీ ఇక్కడ మాత్రం బీజేపీ బలపడమే తమకు కావాలి అన్నట్లుగా కెసిఆర్ ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. బీజేపీ ఎంత బలపడినా తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. బీజేపీకి అన్ని జిల్లాల్లో నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణం.
ఇక కాంగ్రెస్ లో ఎలాగూ గ్రూపు రాజకీయాలు ఉండడంతో అందులోని ముఖ్యమైన నేతలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వారంతా బీజేపీ వైపు కాకుండా టీఆర్ ఎస్ వైపు వస్తారనేది గులాబీ బాస్ ప్లాన్. వారికి పదవులు ఆశ చూపి అన్ని జిల్లాల్లోనూ నాయకత్వ సమర్ధతను పెంచుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. ఒక రెండు లేదా మూడు జిల్లాలు తప్పించి బిజెపి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనేది కేసీఆర్ అంచనా. ఈటల చేరినా ఆ పార్టీ పెద్దగా బలపడదనేది కేసీఆర్ ప్లాన్.