పవన్ తెలివికి ఆశ్చర్యపోతున్న అమరావతి ?

-

ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు సెపరేటు. రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లేందుకు పవన్ వెళుతున్న మార్గం సరైనదా కాదా అనేది పక్కనబెడితే, ఎప్పటికప్పుడు ఎవరూ ఊహించని విధంగా రాజకీయ వ్యూహాలు పన్నుతూ, ఆసక్తికరమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేసే విషయంలో ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం బెడిసి కొట్టినట్లు గా కనిపిస్తోంది. ఒక పక్క బిజెపి, మరో పక్క జనసేన తిరుపతి ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ఈ సంగతి ఇలా ఉండగా, అమరావతి పేరు చెబితే పవన్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తూ వచ్చేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని, మరెక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని చూసినా, ఊరుకోబోమని, రైతులు ప్రజలకు అండగా ఎప్పుడూ జనసేన ఉంటుంది అంటూ పవన్ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. అలాగే సమయం కుదిరినప్పుడల్లా, అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ, అనేక సందర్భాల్లో నిరసన దీక్షలో పాల్గొన్నారు. అలాగే హైకోర్టు లోనూ అమరావతి రాజధాని గా ఉండాలి అంటూ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. కానీ నిన్న అమరావతి ఉద్యమం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, భారీ బహిరంగ సభను అమరావతి జేఏసీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు , పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, అమరావతి పై సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు.

పూర్తిగా అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు చెప్పారు. కానీ ఈ సభకు జనసేన ముఖ్య నాయకులు కానీ , పవన్ కానీ హాజరు కాకపోవడం, అమరావతి ప్రాంత వాసులలో చర్చనీయాంశంగా మారింది. గతంలో పవన్ అమరావతి పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రణభేరి సభకు పవన్ హాజరవుతారని , ఏపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేసి, ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు అని భావించినా, పవన్ ఈ సభకు హాజరు కాలేదు. ఇక్కడే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేసే హడావిడిలో జనసేన పార్టీ ఉంది. ఈ విషయంలో బీజేపీ సైతం పోటీ చేసేందుకు అన్ని రకాలుగా ఎత్తుగడలు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version