లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యాపార లావాదేవీలు ఉన్న నేతలు అదికార పార్టీలో ఉంటేనే మేలన్నట్లు జంప్ అవుతున్నారు. ఈ కోవలోకి మాజీ మంత్రి,ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారని సమాచారం. తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసిన మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు రహస్యంగా భేటీ అయ్యారు. గచ్చిబౌలిలోని నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మామాఅల్లుళ్లు దాదాపు 2 గంటల పాటు చర్చించారట. ఇదే భేటీలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి బీఆర్ఎస్‌లో ఎంపీ టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. అయితే ఆ పార్టీల తరపున పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించిన మల్లారెడ్డి తన కుమారునికి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే.. సీఎం ఫ్రెండ్, సన్నిహితుడైన పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా పార్టీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్‌లోని కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చేరికపై వారు మండిపడుతున్నారు. భద్రారెడ్డికి టికెట్ కేటాయించొద్దని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది.
మల్లారెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని.. ఆయన పార్టీలోకి వస్తే తాము సహిచంబోమని పలువురు కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.గతంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి టీడీపీ పార్టీలో కలిసి పనిచేయగా ఆ తర్వాత మల్లారెడ్డి టీఆర్ఎస్, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థులుగా మారారు. ఒకర్నొకరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో మాల్లారెడ్డి పార్టీలోకి వస్తానంటే ఎలా ఒప్పుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం ఏమో గానీ హస్తం పార్టీలో గందరగోళానికి దారితీస్తున్నారు. అయితే మల్లారెడ్డి చేరికపై సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.