కృష్ణా టీడీపీలో రచ్చ.. బుద్దా అవుట్!

-

పేరుకు టీడీపీకి కంచుకోటగాని..అక్కడ మొత్తం టీడీపీలో రచ్చే నడుస్తోంది..గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్తితి మెరుగవుతున్నట్లు కనిపించడం లేదు. మొదట నుంచి కృష్ణా జిల్లా అంటే టీడీపీకి అనుకూలమైన జిల్లా..కానీ గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అయితే ఎలాగైనా జిల్లాలో టీడీపీ బలం పెంచాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు.

ఎవరి పని వారిదే అన్నట్లు ఉంది. ఇక్కడ చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అయినా సరే ఆ వ్యతిరేకతని టీడీపీ నేతలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. పైగా వైసీపీపై పోరాటం చేసే విషయంలో టీడీపీ నేతలు ఐక్యంగా ఉండటం లేదు. ఇటీవలే చంద్రబాబు, కృష్ణా టీడీపీ నేతలకు క్లాస్ ఇచ్చారు. చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడి చేసిన అంశంలో చాలామంది టీడీపీ నేతలు సరిగ్గా స్పందించలేదు. దీనిపై బాబు..నేతలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. అయినా సరే పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు.

ఏ కార్యక్రమం చేసినా మొక్కుబడిగానే చేస్తున్నారు..అలాగే నేతల మధ్య పెద్దగా సమన్వయం ఉండటం లేదు. తాజాగా ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన బ్యానర్లలో బుద్దా వెంకన్న ఫోటో లేదు. దీంతో బుద్దా సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ… పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని రోజుల క్రితం నేతలకు క్లాస్ తీసుకున్నప్పటికీ నాయకుల్లో తీరు మారలేదని, బ్యానర్‌లో తన ఫోటో లేకపోవడంపై తాను ఏమి మనస్తాపం చెందలేదని, విశాఖలో పని ఉండటం వల్ల వెళ్లిపోతున్నానని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవ పరిస్తితి అయితే ఫోటో లేకపోవడమే అని తెలుస్తోంది. అంటే కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడలో బుద్దా-కేశినేని నాని మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఇప్పుడు ఈ రచ్చ…మొత్తానికి కృష్ణా జిల్లాలో టీడీపీ బాగుపడేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version