అందుకే సమ్మతి ఉపసంహరించాం
పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తిన యనమల
“సిబిఐలో సంక్షోభం వల్లే ఏపిలో ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించాం. రాజకీయ కక్ష సాధింపులకు సిబిఐ సాధనం కారాదు. రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే. రాష్ట్రాలకున్న చట్టపరిధిలోనే చేశాం. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశాం. ఏపి స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలు కూడా అదే నిర్ణయం చేపట్టాలి” అని ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శనివారం ఒక పత్రికా ప్రకటనలో నరేంద్రమోది, అమిత్ షాలపై ధ్వజం ఎత్తారు.
“సంక్షోభంలోకి సిబిఐని నెట్టిందెవరు..? ప్రధాని నరేంద్రమోది కాదా..? ఆర్బిఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందెవరు? ప్రధాని నరేంద్రమోది కాదా..? సివిసిపై, పిఎంవోపై సిబిఐ డైరెక్టర్ ఆరోపణలు గతంలో ఉన్నాయా..? ఏ1,ఏ2లు పీఎంవో లో తిరగడం గతంలో చూశామా..? సిబిఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు ఎప్పుడైనా చూశామా..?
సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ జివో తెచ్చాం. సహకార సమాఖ్య అని బిజెపి నేతలు ఊదరగొట్టారు. సమాఖ్య స్ఫూర్తినే సర్వనాశనం చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా కేంద్రం బలగాలను సుమోటాగా దించరాదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే కేంద్ర బలగాలు రావాలి.అలాగే సిబిఐ విచారణకు కూడా రాష్ట్రాల అనుమతి అనివార్యం.
సిబిఐని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనేది నరేంద్ర మోది దుర్బుద్ధి. ఆర్ బిఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారు. రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వలపై కన్నేశారు. డిమానిటైజేషన్ బూమ్ రాంగ్ కావడంతో ఆర్బీఐ వద్ద నిధులను పొందాలని కుయుక్తులు పన్నుతున్నారు.
రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రంలోని బిజెపి నేతలు చూస్తున్నారు. వాటితో తమ ప్రత్యర్ధులపై కక్ష సాధించే కుట్రలు చేస్తునన్నారు.పేదల సంక్షేమం కంటెరాజకీయ కక్ష సాధింపే నరేంద్ర మోది,అమిత్ షాలకు ముఖ్యం. రాష్ట్రాల అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలే వారికి ప్రధానం.కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలపై కక్ష సాధించాలని చూస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారు. జిఎస్ టి,డిమానిటైజేషన్ అన్నింటిలో విఫలం అయ్యారు.
ఉభయ భ్రష్టత్వంతోనే సిబిఐకి ప్రస్తుతం వైసిపి మద్ధతు:
గతంలో సిబిఐపై ధ్వజమెత్తిన వైసిపి ఇప్పుడు మద్ధతివ్వడం విడ్డూరంగా ఉంది. సిబిఐ భ్రష్టుపట్టాక వైసిపి మద్ధతిస్తోంది. డైరెక్టర్,స్పెషల్ డైరెక్టర్ పరస్పరం కేసులు వేసుకున్నాక సిబిఐకి కితాబిస్తోంది.ఉభయ భ్రష్టత్వంతోనే సిబిఐకి వైసిపి మద్దతుగా మాట్లాడుతోంది. బిజెపి మాటలనే వైసిపి నేతలు వల్లెవేస్తున్నారు.
బిజెపి మినహా దేశంలో ఏ రాజకీయ పార్టీ బతకకూడదు. ప్రతిపక్షాలను లేకుండా చేయడమే మోది,షా జోడి లక్ష్యం.సిబిఐ లాంటి సంస్థలు మోది చేతిలో ఉంటే దేశానికే ప్రమాదకరం.రాజ్యాంగపరంగా రాష్ట్రాలకున్న హక్కులను మోది కాలరాస్తున్నారు.రాజకీయ దుర్భుద్ధితో ప్రధాని నరేంద్రమోది వ్యవహరిస్తున్నారు. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది మోది,షా ల పన్నాగం. ఇతర పార్టీలను కబళించాలని చూస్తున్నారు.ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యానికి అంత బలం.
నగరాల పేర్లు మార్చినట్లే రాజ్యాంగాన్ని, జెండాను కూడా మార్చేస్తారు:
దేశంలో నగరాల పేర్లు మార్చడం బిజెపి నేతల మరో తుగ్లక్ చర్య.ఫైజాబాద్ కు అయోధ్య అని, అహ్మదాబాద్ కు ప్రయాగ్ రాజ్ అని పేర్లుమార్చారు.రేపోమాపో హైదరాబాద్ పేరు కూడా మారుస్తారు.నగరాల పేర్లు మార్చినట్లే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. బిజెపి మళ్లీ గెలిస్తే జాతీయ పతాకాన్ని కూడా మార్చేస్తుంది. త్రివర్ణ పతాకం బదులు కాషాయజెండానే జాతీయ జెండా అంటుంది. అంతర్జాతీయంగా భారత దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు. మన విశిష్ట సంస్కృతి అయిన ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ మార్చేస్తారు.
వ్యవస్థల పతనాన్ని నిరోధించడమే టిడిపి సిద్ధాంతం.ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే టిడిపి లక్ష్యం. రాజ్యాంగ విలువలను రక్షించడం అందరి కర్తవ్యం. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదిని గద్దె దించడం ప్రతిఒక్కరి బాధ్యత. 2019లో బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడం లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి.” అని పిలుపునిచ్చారు.