ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలో నిలిపేందుకు బలమైన అభ్యర్ధుల కోసం తెలుగుదేశం, వైసీపీలు అన్వేషణలో ఉన్నాయి. ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో వైసీపీదే పైచేయిగా ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ సహా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అత్యధికంగా వైసీపీకే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ సమీరణలు మారుతున్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిథులు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో టీడీపీలోకి వెళ్ళకపోయినా పరోక్షంగా ఆ పార్టీకే మద్ధతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో అసలు వైసీపీ అభ్యర్ధిని నిలబెడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. స్థానిక సంస్థలో వైసీపీకే బలం ఉన్నా ఈ ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే, వైసీపీ నుంచి తెరపైకి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే, స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సివస్తోంది.
ఇప్పటికే గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. మరింత మందిని కూటమిలోకి లాగేందుకు మూడుపార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి గెలుచుకుంది. సభలో సంఖ్యా బలం లేనందున వైసీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది.
విశాఖ స్థానిక సంస్థల కోటాలో మాత్రం వైసీపీకి ఆధిక్యత ఎక్కువగా ఉండటంతో.. కూటమి ఈ సీటు గెలుచుకునేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకొనేందుకు కూటమి పార్టీల స్థానిక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. వారు తమతోనే ఉండేలా వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల నుంచి ఓటర్లపై ఒత్తిడి పెరగడంతో విశాఖ కేంద్రంగా జరిగే ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. మరి ఓటర్లు వైసీపీకి పట్టం కడతారా లేక కూటమికి జైకొడతారా అనేది చూడాలి.