నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం… చంద్రబాబు పుట్టిన రోజు నేడు

-

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు …టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. కాగా చంద్రబాబు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన 28వ ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేసారు. టంగుటూరి అంజయ్య మంత్రిమండలిలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని పెళ్లాడారు. అయితే ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించినప్పటికి చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఇక 1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందగా… ఆ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు అనంతరం టీడీపీలో చేరారు.

1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొంది శాసన సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. అయితే ఆ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించడంతో పాటు 2004, 2009 పదేళ్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ఓటమిని చనిచూసింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతోన్నారు.

కాగా చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు కోరారు. కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న వేళ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలని.. అందరి క్షేమమే తనకు ఇచ్చే జన్మదిన కానుక అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version