విశాఖ వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అర్హత లేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో పవన్‌ను కావాలనే ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఆయన హోటల్‌లో ఉన్నప్పుడు భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వవన్ విశాఖలో ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నించారు. పార్టీ అధినేతలకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఉంటుందా అని నిలదీశారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నానని.. వైసీపీ లాంటి నీచమైన పార్టీని జీవితంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.
మంగళగిరిలో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం వీరిరువురు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతోందంటూ మంగళగిరి సభలో వ్యాఖ్యలు చేసిన కాసేపటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.