ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి విజయ దుందుభి మోగించింది.. ఏకంగా 164 స్థానాలు కైవసం చేసుకుని.. శాసనసభలో వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసింది. అసెంబ్లీ మాత్రమే కాకుండా 21 పార్లమెంటు స్థానాలలో (ఇందులో కొన్ని లీడింగ్ దశలో ఉన్నాయి) విజయాన్ని సాధించింది. దీంతో ఏపీలో కూటమినేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో భేటీ అయ్యారు. త్వరలో ఏర్పాటు చేసే ప్రభుత్వానికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు.
ఏపీలో కూటమి అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.. కూటమి నాయకులకు ఓట్లు వేసిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేసినందుకు.. ప్రజలకు నమస్కరిస్తున్నానని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అద్భుతమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన సాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేసిన నేపథ్యంలో.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. “ధన్యవాదాలు నరేంద్ర మోడీ జీ. కూటమి తరఫున మీకు శుభాకాంక్షలు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు శుభాశీస్సులు. ఏపీ ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు వారికి కూడా నా ప్రణామాలు. ఈ విజయం కూటమిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ నమ్మకాన్ని మరింత పారదర్శకంగా ఉంచేందుకు కూటమి తరపున కచ్చితంగా కృషి జరగాలి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పునర్ వైభవం దిశగా అడుగులు పడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత ప్రాంతంగా మార్చాలని” చంద్రబాబు తన ట్వీట్లో ప్రస్తావించారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో కీలకంగా మారుతారని వార్తలు వినిపించాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కే సి వేణుగోపాల్ చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే ఉప ప్రధానమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా వెనకాడ బోరని ప్రచారం జరిగింది. గత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారని చర్చ కూడా జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. కూటమి తరఫున ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో చంద్రబాబు తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని ఒక స్పష్టత ఇచ్చారు. దీంతో విశ్లేషకుల అనుమానాలు మొత్తం పటా పంచలయ్యాయి.