బాబు పాత్రలో ఎంపీ రఘురామకృష్ణంరాజు…జగన్‌కు ఇబ్బందేనా!

-

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు రాజకీయం చేస్తున్నారు. ఇలా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ కూడా బాగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపారు. అయినా సరే బెయిల్ మీద బయటకొచ్చిన రాజుగారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చూస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.

గత కొన్నిరోజులుగా జగన్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలపై వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పాత్రని రఘురామ పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గత రెండేళ్లుగా జగన్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు.

జగన్ తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే ప్రజలు బాబు విమర్శలని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పొచ్చు. ఒకవేళ పట్టించుకుని ఉంటే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అయితే చంద్రబాబు విమర్శలనే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

మరి ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలని ప్రజలు ఎలా తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటికే జగన్ అమలు చేయని హామీలపై చాలా లేఖలు రాశారు. పెన్షన్ పెంపు, సి‌పి‌ఎస్ రద్దు, పెళ్లి కానుక, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం లాంటి అంశాలపై జగన్‌కు లేఖలు రాసిన రఘురామ, తాజాగా రైతుభరోసా విషయంలో జగన్ మాట తప్పారని, ఆ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు.

ఎన్నికల ముందు జగన్ రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలుపుకుని మొత్తం రూ.13,500 ఇస్తున్నారు. అంటే రాష్ట్రం ఇచ్చేది రూ. 7,500. కాబట్టి జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6 వేలు కాకుండా పూర్తిగా రూ. 13,500 ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. అంటే మొత్తం రూ. 19,500 ఇవ్వాలని లేఖలో అడిగారు. ఈ విధంగా రాజుగారు జగన్ ప్రభుత్వానికి పెద్ద ప్రతిపక్షంగా తయారయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version