వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఐకి అవకాశం.. సీఎం జగన్‌ సంచలన నిర్ణయం…!

-

ఈసారి కొత్తవారికి మెండుగా అవకాశాలు కల్పిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్ధులుగా కొత్త ముఖాలను తెరమీదకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు యువనేతలను నియోజకవర్గ ఇన్‌చార్జులుగా నియమించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆసక్తి ఉన్న ప్రభుత్వ అధికారులకు సైతం అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే మూడు లిస్ట్‌ల ద్వారా ఇన్‌చార్జులను ప్రకటించిన సీఎం జగన్‌ నాలుగో జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఇక ఈ లిస్టులో సత్యసాయి జిల్లా నుంచి భారీగా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గమైన మడకశిరలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు అనివార్యమైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి డాక్టర్ తిప్పేస్వామికి అవకాశం కల్పించారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరన్న పై వైసీపీ అభ్యర్థి అయిన డాక్టర్ తిప్పేస్వామి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే తిప్పేస్వామిపై గడిచిన నాలుగేళ్ళలో వ్యతిరేకత రావడంతో ఇక్కడ అభ్యర్ధిని మారుస్తున్నారు సీఎం జగన్‌.

ప్రస్తుతం సామాజిక సమీకరణాలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న డాక్టర్ తిప్పేస్వామిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది.ఈ వ్యతిరేకతకు అనుగుణంగా తిప్పే స్వామికి టికెట్ లేదని ముందుగానే పార్టీ అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం. అనంతరం ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి కోసం వైసిపి అధిష్టానం వేట మొదలుపెట్టింది.

మడకశిర నియోజకవర్గం నుంచి ఎస్సీ అభ్యర్థిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేసిన శుభకుమార్ వైసీపీ టికెట్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఎన్నికల్లో కూడా ఈయన వైసిపి టికెట్ ఆశించారు.సీనియర్‌ అయిన తిప్పేస్వామికే అప్పుడు జగన్‌ టికెట్‌ కేటాయించడంతో సీఐకి నిరాశ ఎదురైంది.అయితే ప్రస్తుతం నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ అధిష్టానం శుభకుమార్ కు టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శుభ కుమార్ కు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరికీ సుపరిచితుడు.

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక మంచి ఆఫీసర్ గా శుభకుమార్ కు గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉండే ఈయన అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం కల వ్యక్తి. శుభ కుమార్ ఎస్సీ నియోజకవర్గమైన మడకశిర నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం(12-01-2024) నాడు సీఎం జగన్‌ని మర్యాదపూర్వకంగా కలవడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.మడకశిర టికెట్‌ తనకు కేటాయించాలని శుభకుమార్‌ కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

మడకశిర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున చాలామంది టికెట్ ఆశించగా వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మూడు దఫాలుగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వైసీపీ నాలుగో లిస్ట్ రిలీజ్ చేయనున్న క్రమంలో మడకశిర నియోజకవర్గం నుంచి పోలీస్ అధికారైన శుభకుమార్ పేరు ఖరారు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కూడా వైఎస్‌ జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసు అధికారి అయిన గోరంట్ల మాధవ్‌కు హిందూపురం ఎంపీగా,హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ dig మహమ్మద్ ఎక్బాల్ కి అవకాశం కల్పించారు.అదే కోవలో 2024 ఎన్నికలకు ఎస్సీ నియోజకవర్గం అయిన మడకశిర నుంచి మరో పోలీసు అధికారి శుభకుమార్ కి అవకాశం కల్పిస్తున్నారని ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version