కమ్మ వారిని.. కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా..?

-

తెలుగు రాజకీయాలు ఇప్పుడు కులాలవారీగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ధోరణి బాగా ఎక్కువ. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఇంకా పెరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమికి ఓ సామాజిక వర్గ ఆధిపత్య ధోరణి కూడా ఓ కారణం అన్న విశ్లేషణలు సాగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కాకపోయినా.. తెలంగాణలోనూ ఇప్పుడు క్యాస్ట్ ఫ్యాక్టర్ కీలకం అవుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ కమ్మ సామాజిక వర్గం బలమైందే అని చెప్పుకోవచ్చు. సంఖ్య తక్కువగానే ఉన్నా ప్రభావితం చేసే స్థాయిలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. అందుకే కేసీఆర్ కూడా ఆ సామాజిక వర్గం వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కమ్మ సామాజిక వర్గం నేతలను చేరదీశారు.

ఇప్పుడు తెలంగాణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఇదే చెబుతున్నారు. అంతే కాదు.. అసలు ఎన్టీఆర్‌ తరువాత రాజకీయంగా కమ్మవారిని ప్రోత్సహించింది ప్రస్తుత సీఎం కేసీఆరే అని కొనియాడుతున్నారు. ఈ మాటలు చెప్పింది.. ఇటీవలే ఆ సామాజిక వర్గం నుంచి మంత్రి అయిన పువ్వాడ అజయ్‌కుమార్‌. కేసీఆర్ ప్రోత్సాహం వల్లే తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కమ్మ వర్గం నుంచి ఎన్నికయ్యారని ఆయన అన్నారు.

అమీర్‌పేట కమ్మసంఘంలో కమ్మవారి తెలంగాణ సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సన్మాన సమావేశం జరిగింది. సమాజాన్ని ప్రభావితం చేయగల సత్తా కమ్మ కులస్తులదేనని ఆ సామాజిక వర్గం నేతలు చెప్పారు. కమ్మ కులస్థులకు రాజకీయ రంగంలోనూ సముచిత స్థానం దక్కాలంటే ఐకమత్యంగా ఉండాలని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, కోనేరు కోనప్ప, ఎన్‌.భాస్కర్‌రావు అన్నారు. అంతే కాదు.. త్వరలో రాష్ట్ర రాజధానికి 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామంటున్నారు కమ్మ సామాజిక వర్గం నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version