ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం ఏ విధంగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సోషల్ మీడియా సైట్స్ లో తమ అప్డేట్స్ ని అప్ లోడ్ చేసేస్తున్నారు. ఇవే కాకుండా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, విద్వేషకర, తప్పుడు పోస్టులు వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే ఇక జైలు జీవితం తప్పదని స్పష్టం చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్.
మంగళవారం ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024 కు యోగి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే లేదా తప్పుడు పోస్టులు పెడితే జరిమానా, మరియు జైలు శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యతిరేక కంటెంట్ ని పోస్ట్ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇలాంటి కంటెంట్ వల్ల మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో అశ్లీలత లేదా పరువుకు నష్టం కలిగించే విషయాలను ప్రచారం చేయడం వల్ల క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉందని ఈ పాలసీని యూపీ ప్రభుత్వం రూపొందించింది. ఇక సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్యూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను తమ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రచారం చేసిన వారికి నెలనెలా 8 లక్షల వరకు అందజేస్తామని తెలిపింది.