దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఇక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నా యి. వాస్తవానికి ఇది కేంద్ర పాలిత ప్రాంతం. అయితే, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అయితే, కేంద్రంలో బీజేపీ అధిష్టానం కొలువుదీరడంతో ఇక్కడ కూడా బీజేపీ విజయం సాధించాలని ఆ పార్టీనాయకులు ఐదేళ్లు గా కలలు కంటున్నారు. ఐదేళ్లకు ముందు ఇక్కడ బీజేపీనే విజయం సాధించి పాలించింది. అయితే, కొన్ని కారణాల రీత్యా సామాజిక ఉద్యమకారుడు, అన్నాహజారే శిష్యుడిగా పేరు తెచ్చుకున్న కేంద్ర ప్రబుత్వ ఉద్యోగి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభంతో ఇక్కడ బీజేపీ తుడిచిపెట్టుకు పోయింది.
అయితే, గడిచిన ఐదేళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక్కడ పాలన సాగిస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవు తున్న నేపథ్యంలో ఆయన పాలన, వ్యవహార శైలి, ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్… డ్యామేజ్.. వంటి అం శాలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నో ఆశలతో ఇక్కడి ప్రజలు కేజ్రీవాల్‌ను గెలిపించారు. అయితే, వాటిని ఫుల్ ఫిల్ చేయడంలో మాత్రం కేజ్రీ కొంతమేరకు వెనుకబడ్డారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఉన్నత విద్యావంతులై ఉండి కూడా తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా వ్యభిచారం వంటి కేసులు నమోదయ్యారు.
అదే సమయంలో ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారనే కారణంగా ఇప్పటికీ ఏడుగురిపై ఎన్నికల సంఘం నమోదు చేసిన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక, ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెడుతున్నా..అవి పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ట్రాఫిక్ సమస్యను నివారించలేక పోయారు. తాగు నీటి ఇక్కట్లు, శాంతి భద్రతలు ఎప్పుడూ కేజ్రీకి సమస్యలుగానే ఉంటున్నాయి. మరోపక్క, ఇక్కడ పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
అదేసమయంలో తాము కేంద్రంలో చక్రం తిప్పుతూ.. ఇక్కడ అధికారంలో కి రాలేక పోవడం ఏంటని బీజేపీ పెద్దలు కూడా ఈ రాష్ట్రాన్నిసవాలుగా తీసుకుని వ్యూహ రచన చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బతగలడం, మేధావుల్లోనూ ఆయనకు మార్కులు పడకపోవడం, సాక్షాత్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నిర్బంధించి మంత్రులు దాడి చేశారనే కేసులు వెంటాడుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన గెలుస్తారా? ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.