దగ్గుబాటి హితేష్‌కు బదులుగా ఆయన తండ్రి వెంకటేశ్వర్ రావును నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలో పరుచూరు ఎమ్మెల్యే టిక్కెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకే ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగానే అందరి కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో ముందుకు దూసుకుపోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఈ విషయంలో కాస్త ముందే ఉందని చెప్పవచ్చు. ఇవాళ పార్టీకి చెందిన తొలి జాబితాను విడుదల చేస్తారని ముందుగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఆ విడుదలను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.
ఇక ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిత్వంలోనూ వైసీపీ చివరి నిమిషంలో అనూహ్యంగా మార్పులు చేసింది. నిన్నటి వరకు ఆ స్థానంలో దగ్గుబాటి హితేష్‌ను నిలబెట్టాలని అనుకున్నారు. కానీ హితేష్‌కు బదులుగా ఇప్పుడు ఆయన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావును పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలపాలని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు అటు వైసీపీ నాయకులు కూడా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పేరునే ఆ స్థానానికి సూచిస్తున్నారట.
దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు నిజానికి ఏపీ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. ఆయన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు పురందేశ్వరి భర్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈయన తోడల్లుడు. దీంతో చంద్రబాబు గుట్టుమట్లు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక దగ్గుబాటిని ఎమ్మెల్యే చేస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు అనుకుంటున్నారట. ఇక అసెంబ్లీలోనూ తనకు దగ్గుబాటి అండగా ఉంటారని జగన్ భావిస్తున్నారని, అలాగే పరుచూరు నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఢీకొట్టాలంటే.. దగ్గుబాటే సరైన వ్యక్తని జగన్ అనుకుంటున్నారట. అందుకనే ఆ స్థానంలో దగ్గుబాటి హితేష్‌కు బదులుగా ఆయన తండ్రి వెంకటేశ్వర్ రావును నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలో పరుచూరు ఎమ్మెల్యే టిక్కెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకే ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే హితేష్‌ను శాసనమండలికి పంపుతారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. మరి వైసీపీ విడుదల చేసే జాబితాల్లో పరుచూరు నియోజకవర్గం అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పేరు ఉంటుందో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!