తెలంగాణ రాజకీయాల్లో దళితబంధు ( Dalit Bandhu ) స్కీమ్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. హుజూరాబాద్‌లో గెలవడానికి స్కీమ్ తీసుకొచ్చారో లేక నిజంగానే దళితులకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ స్కీమ్ తీసుకొచ్చారో తెలియదు గానీ, ఈ పథకంపై మాత్రం పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది. హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని దళితబంధు పథకాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ దళితులకు అండగా ఉండటానికి పథకాన్ని తీసుకొచ్చామని కేసీఆర్ చెబుతున్నారు.
ఎలా తీసుకొచ్చిన మొదటగా ఈ స్కీమ్‌ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తామని చెప్పారు. కానీ తాజాగా కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ ఇచ్చారు. ఇక ఆగష్టు 16న హుజూరాబాద్‌లో అమలు కానుంది. అయితే దళితబంధు దెబ్బకు ప్రతిపక్షాలు పీఠాలు కదులుతున్నాయని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 18 శాతం దళితుల సంక్షేమం కోసమే దళితబంధుని ప్రవేశపెట్టారని, దళితబంధుని అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని ఎమ్మెల్యే బాల్క సుమన్ లాంటి వారు మాట్లాడుతున్నారు.
అయితే ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వడమనేది గొప్ప విషయమే అని విశ్లేషకులు అంటున్నారు. మరి దీని వాళ్ళ టీఆర్ఎస్కు లబ్ది చేకూరే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. కాకపోతే దళితబంధుని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఏ మాత్రం ప్రయత్నించడం లేదని, కానీ రాష్ట్రమంతా పథకాన్ని ఇవ్వాలని అడుగుతున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో హుజూరాబాద్‌కే దళితబంధు ఇచ్చి, ఎన్నికలయ్యాక ఈ స్కీమ్‌ని పక్కనబెడితే, దళితులు…టీఆర్ఎస్ని పక్కనబెడతారని అంటున్నారు. నియోజకవర్గానికి 100 కుటుంబాలకు స్కీమ్ ఇస్తామని అంటున్నారని, వచ్చే ఎన్నికల్లోపు పూర్తిగా దళితులకు పథకం ఇవ్వకపోతే టీఆర్ఎస్కే నష్టమని అంటున్నారు. ఇప్పటికే దళితులకు ఇచ్చిన పలు హామీలని అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఇక ఈ పది లక్షలు అందించే దళితబందు పూర్తిగా అమలు చేయకపోతే కేసీఆర్ అధికార పీఠం కదిలే ఛాన్స్ ఉందని అంటున్నారు.