శ్రీకాకుళం నగరం : విశిష్ట వ్యక్తిత్వం అన్నది సమాజంలో వ్యక్తులకు ఉన్నతికి కారణం అవుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం అన్నది మంచి కార్యక్రమాల నిర్వహణ, తోటి వారికి చేయూతతోనే సాధ్యం అవుతుంది. ఏటా ఓ మంచి కార్యక్రమం నిర్వహించాలన్న ధర్మాన కుటుంబం సంకల్పం అప్రతిహత రీతిలో సాగుతోంది. పేదలకు సాయం అందించడంలోనూ, ఔత్సాహికులను ఆదుకోవడంలోనూ,విశిష్ట వ్యక్తులను ఓ వేదికపై చేర్చి సన్మానించడంలో మున్ముందు ఉంటోంది..ధర్మాన ఛారిటబుల్ ట్రస్ట్. నిన్నటి వేళ ధర్మాన సోదరుల తండ్రి ధర్మాన రామ లింగం నాయుడు శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా పలువురిని సత్కరించింది. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు రాహుల్ వెల్లాల్ గాత్ర కచేరీ విశేషంగా ఆకట్టుకుంది.ఆ వివరాలివి..
రాజకీయం ఎలా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో ఉన్నత ప్రమాణాలే శ్రీరామ రక్ష. రాజకీయం ఎలా ఉన్నా కూడా నలుగురికీ ఆదర్శం కావడమే ప్రామాణికం. అమ్మా నాన్నల స్మరణలో జీవితాన్ని కొనసాగించడమే ఇందుకు మరో ప్రామాణిక రూపం. ప్రేమను పంచిన అమ్మ (సావిత్రమ్మ), బాధ్యతను (రామ లింగం నాయుడు) పంచిన నాన్నను స్మరించడంలో ఆ ధర్మాన సోదరులు ముందుంటారు. ఒకరికొకరు అన్న విధంగా ప్రయాణిస్తారు. నిన్నటి వేళ ధర్మాన రామ లింగం నాయుడు శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
ఏటా నిర్వహించే వేడుకలకు కొనసాగింపు నిన్నటి వేడుకలు. తల్లిదండ్రుల స్మరణ ఒక్కటే కాదు సమాజానికి దీపధారిగా నిలిచిన సందర్భాలనూ,వ్యక్తులనూ తలుచుకోవడం ఈ వేడుక విశిష్ట లక్షణం. పార్టీలకతీతంగా వేల సంఖ్యలో నాయకులు,వారి కార్యకర్తలు హాజరై నిన్నటి వేళ ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని స్మరించారు. ఆరోగ్య రీత్యా ఇల్లు దాటి రాలేని వైదిక ప్రముఖులు ఆరవెల్లి లక్ష్మీనారాయణా చార్యుల ఇంటికి వెళ్లి మరీ ! తన ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానించారు ధర్మాన సోదరులు. తన తండ్రి ధర్మాన రామ లింగం నాయుడు శత జయంతి ముగింపు సందర్భంగా.. పురస్కారం అందించి ఆయన దీవెనలు అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ నాటక కళాకారులు పద్మశ్రీ యడ్ల గోపాలం, ప్రముఖ పరిశోధకులు వెలమల శిమ్మన్నను ఆయన సన్మానించారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఎంపిక చేసి గౌరవించారు ధర్మాన సోదరులు.