ఏలేశ్వరం, తూర్పుగోదావరి: సిరిపురంలోని రామలింగే శ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు ధ్వజస్తంభం విరిగి పడటంతో ఇద్దరు మహిళా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా గురువారం సాయంత్రం పలువురు మహిళలు, భక్తులు శివాలయానికి విచ్చేసి ధ్వజస్తంభం దగ్గర పూజలు నిర్వహించి దీపారాధన చేస్తున్నారు. అదే సమయంలో అర్చకులు వై. శివరామకృష్ణ మూర్తి నేతృత్వంలో పలువురు భక్తులు ఆకాశ దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభ శిఖర భాగాన వేలాడదీసే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా కర్రపుచ్చిపోయి దెబ్బతిన్న ధ్వజస్తంభం పైభాగం కొంతమేర విరిగిపోయి కుప్పకూలింది. గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు సతీమణి కొల్లా వెంకటలక్ష్మి(35) కాళ్లపైన, తిబిరిశెట్టి భద్రలక్ష్మి (50) అనే భక్తురాలి తలపైన పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న మిగిలిన భక్తులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంలో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.