భాజపేతర పార్టీలను కూడగట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా శుక్రవారం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌తో తాజా రాజకీయాలతో పాటూ బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాల గురించి ప్రధానంగా చర్చించారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్.. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం కాల రాస్తోందని మండిపడ్డారు. మతవాద భాజపాని గద్దె దించేందుకు ఐక్యకార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీంతో పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
సీబీఐ సహా స్వతంత్ర వ్యవస్థలన్నింటిని భాజపా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్నారు. నోట్ల రద్దు చేసి రెండేళ్లైందని.. దీనివల్ల ఎవరికి లాభమో చెప్పాలన్నారు. బ్యాంకులకు రూ.వేలకోట్లు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివాళ్లు దేశం వదిలి వెళుతుంటే చోద్యం చూశారని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం.. కాంగ్రెస్‌తో 40 ఏళ్లగా విభేదాలు ఉన్నా పక్కన పెట్టి.. రాహుల్‌ను కలిశామని చంద్రబాబు తెలిపారు.