వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని తెలంగాణా కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.. రాజకీయంగా ఇప్పుడు ఆ పార్టీకి కాస్త అనుకూల పవనాలు వీస్తున్న నేపధ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవకాశాన్ని వదులుకోకుండా కీలక అడుగులు వేస్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన ఆయన చేసిన ఒక కామెంట్ ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం అయింది. అటు అధికార పార్టీ నేతలు సైతం ఈ విషయంలో కాస్త ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.
సీతక్క సిఎం అభ్యర్ధి అనే మాట రావడంతో సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉందని… ఈ ప్రకటన అందుకే రేవంత్ తో చేయించారని అంటున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు చాలా మంది సిఎం పదవి కోసం కాస్త గట్టిగా కష్టపడుతున్నారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి వాళ్ళు ఇక మైనార్టీ నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి జానారెడ్డి వంటి వాళ్ళు ఈ పదవి కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం చూస్తూనే ఉన్నాం.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తమలో ఎవరూ కాకుండా గిరిజన నేత అయితే అన్ని విధాలుగా పార్టీకి కలిసి వస్తుందని ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఇది బాగా కలిసి వచ్చే అంశం అని అంటున్నారు. ఆమెనే దాదాపుగా ఖరారు అయ్యారని తెలుస్తుంది. ఇతర ఎస్సీ సామాజిక వర్గ నేతలతో అధిష్టానం ఇప్పటికే మాట్లాడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సీతక్కను అందుకే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రచారం చేస్తుందని అంటున్నారు.