ఈ వారం చివర్లో లేదా వచ్చే మంగళవారం రోజున కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయవచ్చని తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నగారా మోగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో 17వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలవచ్చనే వార్తలు ఊపందుకోవడంతో.. వాటిని నిజం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నేడో, రేపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
ఈ వారం చివర్లో లేదా వచ్చే మంగళవారం రోజున కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయవచ్చని తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలు జరిగే తేదీలను కూడా అదే రోజున ప్రకటించనున్నట్లు తెలిసింది. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే వచ్చే ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. అందుకు గాను అవసరమైన సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనున్న విషయం విదితమే. అయితే ఈ విషయంపై చర్చించేందుకు వచ్చే వారంలో ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికలు 7 లేదా 8 దశల్లో జరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెలాఖరు వరకు తొలి దశ ప్రకటన వెలువడుతుందని తెలుస్తుండగా, ఇందుకు గాను ఎన్నికలు ఏప్రిల్‌లో జరుగుతాయని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ ఎన్నికలతోపాటు పదవీ కాలం పూర్తి కావస్తున్న ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని చూస్తోంది. అయితే ఒకేసారి లోక్‌సభతోపాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదే నిజమైతే రాజకీయ పార్టీలలో ఎన్నికల వేడి మరింత పెరగనుంది. కాగా 2014లో మార్చి 5వ తేదీన ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. కానీ ఈ సారి 5వ తేదీ దాటాక కూడా షెడ్యూల్ ను ఈసీ ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి..!