మల్కాజిగిరిపై పట్టు నిలుపుకున్న ఈటెల రాజేందర్

-

బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మల్కాజిగిరి సీటును మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దక్కించుకుని పట్టు నిలుపుకున్నారు.ఈ స్థానం కోసం చాలామంది బీజేపీ నేతలు పోటీపడిన విషయం తెలిసిందే.వారందరినీ వెనక్కి నెట్టిన ఈటల రాజేందర్ హై కమాండ్ ని ఒప్పించి ఆ సీటును సొంతం చేసుకున్నారు.నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ ఓడిపోయారు.బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఓటమితో ఆయన కుంగిపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పట్టు నిలుపుకోవాలని నిర్ణయిoచుకున్నారు.ఈ నేపథ్యంలో పట్టుబట్టి మరీ అత్యంత ప్రాధాన్యత కలిగిన మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటును సాధించారు.

తెలంగాణలో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం మరో హాట్ సిటీగా మారింది. ఈ సెగ్మెంట్ నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ప్రతిపాదన కూడా వినిపించింది.మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపుతుందని కమలనాథులు ఇంతకుముందు లెక్కలు వేశారు.ఒకవేళ నరేంద్ర మోదీ అంగీకరించకపోతే బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజిగిరి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.అయితే వారందరినీ కాదని అధిష్టానం ఈటెలకే టికెట్ ఖరారు చేసింది. చాలారోజుల నుంచి మల్కాజిగిరి పరిధిలొనే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే టికెట్ కేటాయించడం ఆయనకు కలిసొచ్చే అంశం.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం.. దేశంలోనే అతిపెద్ద లోక్‌ సభ స్థానం.. ఈ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఐదు నియోజకవర్గాలు… రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి 2009లో మల్కాజిగిరి లోక్‌ సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 30 లక్షలకు పైగా ఓట్లున్న అతిపెద్ద లోక్ సభ స్థానం ఇది. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైంది. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల వారు నివాసముంటారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజలు కలిసి ఉండే నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువు కాదు.ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేయడమే కాదు గెలిచి సత్తా చాటాలని ఈటెల ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు ఈట‌ల రాజేంద‌ర్. 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటిచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు.నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డి పై గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి పై గెలిచి కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.మరో 5 శాఖల బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు.2019లో మళ్లీ గెలిచి కెసీఆర్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు.


భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.తనను ఉదేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేసారు.టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12 న రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.

2021 అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 23, 855 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.2023 జులై 04న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ హైకమాండ్‌ నియమించింది.ఈటెల గత కొద్దిరోజులుగా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే ఎంపీ సీటు ఖరారు చేయడంతో కార్యకర్తలతో కలిసి ప్రచారాలకు సిద్ధమవుతున్నారు.అక్కడి నుంచి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version