ఏపీలో ఆర్థిక‌నేర‌స్తుల పున‌రావాస కేంద్రంగా బీజేపీ

-

ఏపీలో బీజేపీ ఆర్థిన నేర‌స్తుల‌కు పున‌రావాస కేంద్రంగా మారిపోయింది. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టడంతో పాటు, పలు నేరాలకు సంబంధించి కేసుల్లో ఇరుకున్న టీడీపీ నేతల ఎంచ‌క్కా బీజేపీలో చేరి ఇప్పుడు అక్క‌డ చ‌క్రం తిప్పుతుండ‌డంతో పాత బీజేపీ నేత‌లు క‌క్క‌లేక మింగ‌లేక చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుజ‌నా చౌద‌రి విష‌యానికి వ‌స్తే బ్యాంకులకు ఆరు వేల కోట్లు ఎగ్గొట్టడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయిన తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు అక్క‌డ ఓ వెలుగు వెలిగి పోతున్నారు.

సుజ‌నా చౌద‌రి త‌న‌తో పాటు మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీ ఎం.ర‌మేష్‌తో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ.వెంక‌టేష్‌ను సైతం బీజేపీలోకి తీసుకుపోయారు. దీంతో ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్ద‌లు సైతం సుజ‌నా చౌద‌రికి ఎక్క‌డా లేని ప్ర‌యార్టీ ఇస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఎన్నో ఆర్థిక నేరాలు, కుంభ‌కోణాల‌కు పాల్ప‌డిన రాజ‌కీయ నేత‌ల‌తో పాటు అనేక వివాదాల్లో కూరుకుపోయిన వారు…. అప్పుడు వైసీపీని గ‌ట్టిగా టార్గెగ్‌గా చేసుకుని….. ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌కు టార్గెట్ అవుతామ‌ని భ‌య‌ప‌డుతోన్న వారంతా బీజేపీ గూట్లో సేద తీరితే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని భావించి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు.

ఇక కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి అందుకు తహతహలాడుతున్నారు. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు సైతం కే ట్యాక్స్ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక ఇప్పుడు ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్న మ‌రో నేత సైతం బీజేపీలో చేరారు. ఈయనది కూడా బ్యాంకులకు వందల కోట్లు ఎగొట్టి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న కేటగిరినే. ఆయ‌న ఎవ‌రో కాదు ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి.

రాంగ్ ప‌త్రాలు చూపించి రు.950 కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టిన‌ట్టు ఆయ‌నపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాకాటిపై ఈ ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్పుడే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ అవ‌కాశం ఇచ్చారు. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం వాకాటితో తమకు సంబంధం లేదని ప్రకటించారు చంద్రబాబు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరిపోవడంతో ఇక వాకాటి నారాయణరెడ్డికి సీబీఐ, ఈడీ లాంటి సంస్థల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని చెబుతున్నారు.

ఒక్క వాకాటి మాత్ర‌మే కాదు… టీడీపీలో ఈ బాప‌తు నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీళ్లంతా బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే వైసీపీలో చేర‌డం… అటు నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రాక‌పోతే బీజేపీయే బెస్ట్ ఆప్ష‌న్ అన్న చందంగా వీరు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version