తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య చాలా నియోజకవర్గాల్లో రోజు రోజుకు ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిష్కృతమైంది. ఈ జిల్లా నుంచి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆమెకు వరుసకు అల్లుడైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి అస్సలు పొసగడం లేదు.
ఒకప్పుడు సబిత కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఆమెదే పెత్తనం. ఆ తర్వాత మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి మంత్రిగా గెలిచినప్పుడు ఐదేళ్లు జిల్లా రాజకీయాలను ఆయనే శాసించారు. అప్పుడు కూడా ఆయన భార్య జడ్పీచైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో సబిత కాంగ్రెస్ నుంచి గెలిచారు. మహేందర్‌రెడ్డి మంత్రిగా ఉండి ఓడిపోయారు.
ఆ తర్వాత సబిత టీఆర్ఎస్‌లోకి వచ్చి తెలంగాణ తొలి మహిళా మంత్రిగా రికార్డులకు ఎక్కారు. కేసీఆర్ ఆమెకు మంచి ప్రయార్టీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మహేందర్‌రెడ్డి ప్రత్యర్థి, ఆయనపై గెలిచిన రోహిత్‌రెడ్డి సైతం టీఆర్ఎస్‌లోకి రావడంతో మహేందర్‌రెడ్డిని ఒంటరయ్యారు. ఇప్పుడు సబిత కూడా రోహిత్‌రెడ్డికే ప్రయార్టీ ఇస్తున్న వాతావరణం ఉంది.
ఈ క్రమంలోనే జిల్లాలో సబిత హాజరవుతోన్న కార్యక్రమాలకు మహేందర్‌రెడ్డి దంపతులు దూరంగా ఉంటున్నారు. సబిత తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, మహేందర్‌రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కూడా ఆమెను కలవలేదని తెలుస్తోంది. మహేందర్ రెడ్డిని తీవ్రంగా విభేదించే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం ఇప్పుడు సబితతోనే ఉంటున్నారు.
చివరకు మహేందర్‌రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నా అవి కూడా నెరవేరే పరిస్థితి లేదు. అటు కేసీఆర్ దగ్గర సబిత ప్రయార్టీ పెరగడం.. అదే టైంలో మహేందర్‌రెడ్డి హవా తగ్గడం కూడా ఆయన రాజకీయంగా వెనకపడి పోవడానికి కారణమైంది. ఇక మొన్న ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని ఓడించి జెయింట్ కిల్లర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని కూడా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదట.