రాయచోటి వైసీపీ అడ్డా…ఈసారి కూడా శ్రీకాంత్ రెడ్డిదే గెలుపు

-

కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విన్నింగ్ గ్రాఫ్ ఉంది. గడిచిన నాలుగు ఎన్నికల్లోనూ గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2004లో చివరి సారి గెలిచింది. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ మరియు వైసీపీ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. వైసీపీలో చీఫ్ విప్ గా ఉన్న ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటె ఈ సారి గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్నారేమో కానీ.. టీడీపీ నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ తామే పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో క్యాడర్ లోనూ గందరగోళం ఏర్పడుతోంది.

రాయచోటిలో చంద్రబాబునాయుడు టికెట్‌ పట్ల స్పష్టత ఇవ్వకపోవడం గందర గోళానికి దారితీస్తోంది. ఇప్పటివరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆర్‌. రమేష్‌రెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు దగ్గరయ్యేందుక ఆయన కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల విజయసాయిరెడ్డికి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాధరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన కూడా టిక్కెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తూన్నారు.

మరో వైపు రాంప్రసాద్‌రెడ్డి టీడీపీ టికెట్‌ తనకు ఇచ్చారనే పేరుతో సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తూ అనుచరులతో బాణాసంచా కాల్చడం వంటివి చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించిన సుగువాసి పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రాయచోటి సీటు అడుగుతున్నారు. ఇటీవల పులివెందులలో పార్టీ అధినేత చంద్రబాబును కలసి టిక్కెట్ తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం.ఈ పరిణామాలతో రాయచోటి టీడీపీలో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఎవరికి జై కొట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

రాయఛోటిలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి బలమైన గ్రాఫ్ ఉంది.2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడుపై నెగ్గారు. 14,832 ఓట్ల మెజారిటీ శ్రీకాంత్ రెడ్డి కి దక్కింది. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన జగన్మోహన రెడ్డి వెంట నడిచారు.కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగవాసీపై 56,891 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2014లో వైసీపీ తరపున మళ్లీ నిలబడి టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై 34,782 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఇక 2019 ఎన్నికల్లో మూడోసారి వైసీపీ తరపున బరిలో దిగి టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డిపై 32,862 ఓట్ల మెజారిటీతో గెలిచారు.పోటీ చేసిన ప్రతిసారీ ఓటర్లు శ్రీకాంత్ రెడ్డికి సూపర్ మెజారిటీ ఇస్తున్నారు.2012లో శ్రీకాంత్ రెడ్డికి వచ్చిన మెజారిటీనే ఇప్పటివరకు ఇక్కడ అత్యధికం.మరోసారి శ్రీకాంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉండటంతో అత్యధిక మెజారిటీ సాధనే లక్ష్యంగా ఆయన ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version