అడవి మల్లెల పాట..వింటూ పోతుంటే..మా నేలలకు ఓ కొత్త సోయగం అలంకారం అయి ఉంటుంది. ఉత్తరాంధ్ర పాటకు పరవశించిన కవి వాక్కులు కొన్ని మా నేలను ప్రశసించి వెళ్తుంటే మళ్లీ మళ్లీ నాటి ఉద్యమ కాల రీతులను స్మరించుకున్న విధంగా ఉంటుంది. కవి ఏ ప్రాంతానికి చెందిన వాడు అన్నది కన్నా ఏ పాటి రాశాడు ఏపాటి ప్రభావితం చేశాడు అన్నదే కీలకం.. ఆ కోవలో తెలంగాణ దారుల నుంచి వచ్చాడో కవి.. ఉత్తరాంధ్ర నేలకు ఇక్కడి దాచి పెట్టుకున్న చైతన్య శక్తి, సంఘటిత శక్తికి వందనాలు చెల్లించి వెళ్లాడు.
కవి అన్న పదం దగ్గర ఆగిపోవాలి.. ప్రాథమికంగా కవి అన్నది గోరటికి అంగీకారంలో ఉన్న పదం.. అలాంటి ప్రాథమిక కవి సిక్కోలు నేలల్లో దాగిపోయిన పాట సాహిత్యం, సంబంధిత గొప్పదనం చెప్పి వెళ్లాడు.. స్థానికంగా పాట నిలిచి గెలిచిన చోట పొంగిపోయాడు.ఆ కవి గోరటి వెంకన్న.
సంక్రాంతి సంబరాల వేళ ఉత్తరాంధ్ర నేలను పలకరించారు తెలంగాణ కవి,ఎమ్మెల్సీ, తాజా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న. ఉత్తరాంధ్ర నేలతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. పలాస నియోజకవర్గం, మొగిలిపాడు వచ్చి సందడి చేశారు. సిక్కోలు జానపద కళా వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడిపాడారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాటల్లో ఉన్న సౌందర్యం, పాట వెనుక ఉన్న నేపథ్యం, పాట ప్రోది చేసే చైతన్యం వీటన్నింటి గురించి వివరించి చెప్పారు. ఆడి పాడి స్థానిక కళాకారులను ఉత్సాహ పరిచారు. తెలుగు జాతి రెండు ప్రాంతాలుగా విడిపోయినా పాట రూపంలో మనమంతా ఒక్కటేనని చెప్పారు.