తెలంగాణాలో కాంగ్రెస్ బలంగా ఉండాలి అంటే ముందు అధిష్టానం అనేది సమర్ధవంతంగా పని చేసే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నేతల్లో సమన్వయము లేకుండా పార్టీ ఎంత కష్టపడినా సరే, కార్యకర్తల్లో మాత్రం జోష్ అనేది రాదు అనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడటం మనం చూస్తున్నాం. కానీ ఆ పార్టీలో ఉన్న నేతలు ఆశించిన స్థాయిలో సహకారం అందించడం లేదు. కాంగ్రెస్ నేతలు చాలా మంది తెరాస పార్టీలోకి వెళ్ళిపోతున్నారు.
ఒక పక్కన హరీష్ రావు సమర్ధవంతంగా పని చేస్తున్నారు. ఆయన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలను ఆయన తెరాస లోకి ఆహ్వానించి కండువాలు కప్పేస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తుంది. బలమైన కేడర్ ఉన్న పార్టీ హరీష్ ని ఎదుర్కొలేకపోతుంది. తెరాస నుంచి ఎలాగూ నేతలు వచ్చే అవకాశం లేదు. అభ్యర్ధిగా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి తెరాస లో అవకాశం రాక వచ్చారు. కనీసం ఆయన వర్గాన్ని అయినా సమర్ధవంతంగా పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు.
రాజకీయంగా ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక అనేది తెరాస కంటే కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. గత ఏడాది హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ చావు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కొందరు కాంగ్రెస్ నేతల ఇంట్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో వాళ్ళు ఏది మాట్లాడుకున్నారు ఏంటీ అనేది మొత్తం బయటకు వచ్చింది. దీనితో ఆ సమావేశంలో కాంగ్రెస్ వ్యూహాలను చెల్లాచెదురు చేసారు హరీష్ రావు.
కాంగ్రెస్ నుంచి బలమైన నేతలు ఉన్నా సరే నియోజకవర్గంలో వారిని కూడా కాపాడుకోవడం లేదు. పోనీ బిజెపి నుంచి కూడా ఇప్పుడు నేతలను ఆకట్టుకోలేకపోతున్నారు. బిజెపి నేత కమలాకర్ రెడ్డిని ఆహ్వానించే ప్రయత్నం చేయడం రేవంత్ రెడ్డి సఫలం అయినా సరే… కాంగ్రెస్ నేతల నుంచి ఆయనకు ప్రోత్సాహం అనేది లేదు. ఇక క్షేత్ర స్థాయిలో గ్రామాల లెక్కన ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చిన వారు కూడా ముందుకు వచ్చి పని చేయడం లేదు. చివరికి వాళ్ళు కూడా తెరాస కు పరోక్షంగా జై కొడుతున్నారు.