రాష్ర్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ ను విబేధించి బయటకు వచ్చి కాషాయ కండువా కప్పుకున్న మంత్రి రాజేందర్ ను ఎలాగైనా ఓడించి తీరాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది . అందుకు తగ్గట్లుగానే అందరినీ మచ్చిక చేసుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే టీటీడీపీ అధినేత ఎల్.రమణ (L ramana)హుజురాబాద్ లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాడని తెలుస్తోంది. ఇటీవలే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసిన ఎల్. రమణకు ఈ మేరకు స్పష్టమైన హామీ లభించిదని తెలుస్తోంది.
ఎల్. రమణ కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సామాజిక వర్గం కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా అందరూ భావిస్తున్నారు. ఇటీవల హుజురాబాద్ నేత కులస్తులను సర్వే చేసిన టీం షాకింగ్ విషయాలు చెప్పిందట. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చేనేత కులస్తులందరూ ఈటల రాజేందర్ వైపే ఉన్నారని, వారంతా టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర కోపంతో ఉన్నారని ఆ సర్వే బృందం తెలియజేసిందని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో చేనేత కులస్తులవి దాదాపు 30 వేల ఓట్ల వరకు ఉంటాయి. ఎల్. రమణ కూడా చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతడిని బరిలో నిలపడం ద్వారా ఆ సామాజిక వర్గం వారిని ప్రసన్నం చేసుకునేందుకు వీలుంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారట. ఇలా ఎలా చూసినా… ఎల్. రమణ చేరిక టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. అంతే కాకుండా ఈటల రాజేందర్ కు బీజేపీ దూకుడు కు కళ్లెం వేయాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.