చెన్నై: దివంగత ఎంజీఆర్ రాజకీయ వారసుడిని తానే అని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. ఎంజీఆర్ కలలను సాగారం చేస్తూ.. ప్రజా సేవ చేయాలనే భావనతో రాజకీయాల్లోకి అడుగేశానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాల్లో పర్యటించారు. విద్యార్థులు, యువకులు, మహిళలతో కలిసి బహిరంగంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ… రజనీకాంత్ సిద్ధాంతాలు, తన సిద్ధాంతాలు వేరని చెప్పారు. ఇద్దరిది సినీ పరిశ్రమే అయినా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో రాజకీయాల్లో అడుగు వేశామన్నారు. అయినా తామిద్దరం మంచి స్నేహితులం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయా.. లేదా అనేది.. రజనీకాంత్ వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు, పరిపాలనలో మార్పు జరగనుందని ఆశిద్దామన్నారు. రజనీకాంత్ తో రహస్యాలు ఏమీ లేవన్నారు. బహిరంగంగానే రజనీకాంత్ ను రాజకీయాల్లో ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన కూటమిలో రావాలంటూ పిలుస్తున్నానని కమల్ హాసన్ పేర్కొన్నారు. పార్టీ గుర్తుగా టార్చ్ లైట్ చిహ్నం కోసం ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. ఆ గుర్తే దక్కుతుందని భావిద్దామన్నారు. మక్కల్ నీది మయ్యం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడో కూటమి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అందుకు తగ్గ పరిస్థితుల కోసం వేచి చూద్దామన్నారు.
టార్చ్ లైట్ చిహ్నం వదులుకోం..
టార్చ్ లైట్ చిహ్నం కోసం మక్కల్ నీది మయ్యం ఎలక్షన్ కమిషన్ ని ఉత్తర్వులు పంపించామని, టార్చ్ లైట్ గుర్తును వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్ మక్కల్ కట్చి నేత విశ్వనాథన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కన్నా ముందు సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ తమకు టార్చ్ లైట్ గుర్తు కేటాయించిందని, కమల్ హాసన్ వచ్చి అడిగినా గుర్తును వదులుకోమన్నారు.