విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం చాలా రోజుల నుంచి టిడిపిలో హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఎంపీ హోదాలో తన పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. తాను ప్రజల కోసమే పనిచేస్తానని, పార్టీల కోసం కాదని పలుమార్లు చెప్పారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో టీడీపీకి ఇబ్బందిగా మారింది.
ఇక ఆయనపై కొందరు నేతలు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు. కానీ అధిష్టానం కేశినేని అంశాన్ని ఇంకా ఎటు తేల్చలేదు. ఈలోపు కేశినేని మాత్రం మాటల దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన టిడిపిపై విరుచుకుపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని, తనకు ఎటువంటి పదవులూ లేవని, కేంద్ర హోం మత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు కలయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు.
అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనని, అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనని, తాను ఏదీ చేసినా మెచ్చుకునే వాళ్లు, తిట్టుకునే వాళ్లు ఉంటారని, తాను రాజకీయాల్లో ఏం చేస్తాననే దాని పై తనకు స్పష్టత ఉందని కేశినేని నాని తెలిపారు. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలుస్తానని, అంతిమంగా గెలుపోటమలు ప్రజలు నిర్ణయిస్తారని, తన పార్టీ కార్యాలయంపై బ్యానర్లు చూడాలని, తనని తిట్టినోళ్ల ఫొటోలు కూడా తన ఫ్లెక్సీలో ఉన్నాయని, అసలు పార్టీలో ఇన్‌చార్జి లు ఎవరు…? వాళ్లంతా గొట్టంగాళ్లు అని, విజయవాడ ప్రజలంతా తనతో కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని అన్నారు.
టీడీపీ మాహానాడుకు తనకు ఆహ్వానం లేదని, తాను ఒక ఎంపీని… అక్కడ రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టారని, ఎంపీగా తనకు అసలు ఆహ్వానం లేదని, ఢిల్లీకి చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, బాధ్యతగా వెళ్లి మా అధినేతను కలిశానని అన్నారు. ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, చిర్రెత్తితే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. అంటే ఆయన ఏదొక రోజు జంప్ అయ్యేలా ఉన్నారు. టిడిపిలోని కొందరు నేతలతో పడక ఆయన పార్టీ మారిన ఆశ్చర్యం అవసరం లేదు.