ఆ యువనేత స్టార్ క్యాంపెయినర్ కాదా…?

-

నారా లోకేష్… కాబోయే సీఎం అంటూ టీడీపీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి. యువగళం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి… టీడీపీకి ఇంకా క్యాడర్ ఉంది అని నిరూపించేందుకు కష్టపడిన నేత. అటు ఆయన కూడా పాదయాత్రలో టార్గెట్ వైసీపీ అన్నట్లుగా పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ గెలుస్తుందని… అప్పుడు వైసీపీకి సహకరించిన ఉద్యోగులకు తగినరీతిలో బుద్ధి చెబుతామని.. చేతిలో ఓ రెడ్ బుక్ చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. కుప్పం టూ ఇచ్ఛాపురం అని ప్రారంభించిన పాదయాత్ర… అనకాపల్లి శివారులోనే ఆపేశారు. యువగళం సాగని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలంటూ హంగామా చేశారు. అయితే… ఆ తర్వాత లోకేష్ ఎటు వెళ్లిపోయారంటే… ఏమో అంటున్నారు టీడీపీ నేతలు.

2019 ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన లోకేష్‌ ఏకంగా 5 వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయాడు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి హోదాలో ఇలా ఓడిపోవడం ఏమిటని అంతా విమర్శలు కూడా చేశారు. దీంతో… దాదాపు ఏడాది పాటు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు లోకేష్. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్‌ మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేస్తా అని ప్రకటించారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.. తప్ప మంగళగిరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చినప్పటికీ… అలా వచ్చి… ఇలా వెళ్లడం వరకే సరిపోయింది. చివరికి నాలుగేళ్లలో పార్టీ కేంద్ర కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఇక పాదయాత్ర తర్వాత లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తారని అంతా భావించారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధినేత చంద్రబాబు… ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తున్నారు. అటు జనసేనాని పవన్ కూడా తన వారాహి యాత్రను పిఠాపురం నుంచి మొదలుపెట్టారు. మరోవైపు పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు సీఎం జగన్ కూడా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు.

మంగళగిరిలో ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతో ఉన్న లోకేష్‌ కేవలం మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. టీడీపీ భవిష్యత్‌ సారధి అని ఓ వైపు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే… లోకేష్ మాత్రం మంగళగిరి దాటి వచ్చేందుకు భయపడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. అసలు స్టార్ క్యాంపెయినర్ అంటే రాష్ట్రమంతా తిరిగి పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేయాల్సిన నేత. కానీ లోకేష్ మాత్రం ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గం దాటి బయటకు రాలేదు.

చివరికి దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన సమయంలో కూడా… అక్కడ స్థానిక నేతలతో ఎలాంటి చర్చలు జరపలేదు. అప్పటికే తిరుపతి సీటు కేటాయింపుపై నేతల అసమ్మతి కొనసాగుతోంది.. కానీ లోకేష్ మాత్రం దాని పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే… నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో అసలు లోకేష్ స్టార్ క్యాంపెయినరా కాదా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version