తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీటు విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు నేతలు వీధికెక్కి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మొదట నుంచి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య పోరు ఉంది.
గతంలో ఈ ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకే పార్టీలోకి వచ్చారు. ఇక 2014లో రాజయ్య ఘనపూర్ ఎమ్మెల్యేగా, కడియం వరంగల్ ఎంపీగా గెలిచారు. రాజయ్యని మంత్రివర్గంలో తీసుకుని తర్వాత తప్పించారు. అలాగే ఎంపీగా ఉన్న కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రాజయ్యకు మళ్ళీ ఘనపూర్ సీటు దక్కగా, ఆయన మళ్ళీ గెలిచారు. కానీ కడియంకు ఏ సీటు దక్కలేదు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పదవి దక్కింది.
అయితే నెక్స్ట్ ఘనపూర్ సీటు దక్కించుకోవాలని కడియం ట్రై చేస్తున్నారు..కానీ నియోజకవర్గంలోకి కడియంని కాలు కూడా పెట్టనివ్వను అని రాజయ్య సవాల్ చేశారు. అలాగే కడియంపై ఈ మధ్య విమర్శలు చేశారు. దీనికి కడియం కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. ఇలా రెండు మూడు రోజులు వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది.
మరి సడన్ గా ఏం జరిగిందో తెలియదు గాని..తాను, కడియం…ఘనపూర్ నియోజకవర్గానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళమని, ఒకే వైపు చూస్తే మరో కన్ను పోతుందని, కడియంకు ఎమ్మెల్సీ ఇవ్వడం సంతోషంగా ఉందని మాట్లాడారు. మొన్నటివరకు తిట్టిన రాజయ్య…ఇప్పుడు సడన్ గా కడియంపై ప్రేమ చూపిస్తున్నారు. అధిష్టానం క్లాస్ పీకడం వల్ల ఏమన్నా మార్పు వచ్చిందా? లేక కడియం సప్రోట్ లేకపోతే ఘనపూర్‌లో గెలవడం కష్టమని ఇలా మాట్లాడుతున్నారా? లేదా అసలు సీటు కడియంకు ఇస్తున్నారా?అనేది తెలియడం లేదు. మొత్తానికి కడియం సపోర్ట్ కావాలనే విధంగా రాజయ్య మాట్లాడటం ఘనపూర్ నియోజకవర్గంలో సెన్సేషన్‌గా మారింది. మరి చూడాలి ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుందో.